
భోపాల్: జర్నలిస్టు సహా మరికొంత మందిని పోలీసు స్టేషన్‌లో అర్ధ నగ్నంగా నిలుచోబెట్టిన ఫొటో వైరల్ మారింది. ఓ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నాడనే నెపంతో పోలీసులు వారిని చితకబాది, బట్టలు విప్పించారని బాధితులు పేర్కొన్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. సిధి జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లా, అతని కుమారుడు గురుదత్ శుక్లాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారనే నెపంతో నీరజ్ కుందర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అరెస్ట్‌కు నిరసనగా, బీజేపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నిరసనలకు దిగారు. ఈ నిరసనను కవర్ చేసేందుకు స‍్థాసని జర్నలిస్టు, యూ ట్యూబర్ కనిష్క తివారీ తన కెమెరామెన్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిరసనకారులతో సహా జర్నలిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం స్టేషన్‌లో వారిని కొట్టి, దుర్భాషలాడారని, అర్ధ నగ్నంగా నిలుచోబెట్టారని తివారీ చెప్పారు. పోలీసులు తమను ఏప్రిల్ 2న రాత్రి 8 గంటలకు అదుపులోకి తీసుకొని ఏప్రిల్ 3 సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారని తివారీ ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఎమ్మెల్యేపై ఎందుకు కథనాలు రాస్తున్నారని ప్రశ‍్నించారని తెలిపాడు. ఎమ‍్మెల్యే ఆదేశాలతోనే పోలీసులు ఇచా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరోవైపు.. పోలీసు స్టేషన్ వ్యవహారం రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. ఈ విషయం కాస్తా.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన సీఎం.. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment