‘హద్దు’మీరిన కిక్కు  | Karnataka Liquor Flowing Endlessly In Anantapur | Sakshi
Sakshi News home page

‘హద్దు’మీరిన కిక్కు 

Published Fri, Apr 30 2021 4:42 AM | Last Updated on Fri, Apr 30 2021 4:43 AM

Karnataka Liquor Flowing Endlessly In Anantapur - Sakshi

ఇది అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం కల్యం గ్రామం కొత్తూరు గేటు వద్ద ఏర్పాటు చేసిన మద్యం దుకాణం. ఈ షాపు కర్ణాటక భూభాగంలో ఉండగా.. మద్యం మాత్రం ఆంధ్రాలో పారుతోంది. ఆంధ్ర సరిహద్దుకు అరకిలోమీటర్‌ దూరంలో ఉన్న ఈ దుకాణానికి వచ్చే కర్ణాటక మద్యం.. రోజూ రాత్రి వేళల్లో సరిహద్దు దాటి మన జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి చేరుతోంది. మద్యం, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఇక్కడ ‘సెబ్‌’ చెక్‌పోస్టు ఏర్పాటు చేసినా.. ఈ షాపు నుంచి సరిహద్దు దాటుతున్న మద్యాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. ఈ అక్రమ మద్యం దందాలో ‘సెబ్‌’ అధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

రాయదుర్గం: మద్యపాన నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండగా.. కర్ణాటక సరుకు మాత్రం అనంతపురం జిల్లాను ముంచెత్తుతోంది. కట్టడి చేయాల్సిన కొందరు అధికారులే కాసులు తీసుకుని కళ్లుమూసుకుంటుండగా కర్ణాటక మద్యం ఆంధ్రాలోకి అక్రమంగా వచ్చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న రాయదుర్గం నియోజకవర్గం నుంచే కర్ణాటక మద్యం భారీగా జిల్లాలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రతో పోలిస్తే కర్ణాటకలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో అక్రమ రవాణా ఊపందుకుంది. ఈ క్రమంలోనే అక్రమంగా ఆంధ్రలోకి ప్రవేశిస్తున్న కర్ణాటక మద్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం శాండ్‌ అండ్‌ లిక్కర్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. గుమ్మఘట్ట మండలంలో 2, రాయదుర్గం మండలంలో 2, డి.హీరేహాళ్‌ మండలంలో 9, బొమ్మనహాళ్‌ మండలంలో 4 చొప్పున మొత్తం 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. అయినా అక్రమార్కులు అడ్డదారుల్లో కర్ణాటక మద్యాన్ని జిల్లాకు చేరవేస్తున్నారు.

కర్ణాటక పరిధిలో షాపులు.. ఆంధ్ర రోడ్డులో సరాఫరా
ఆంధ్రాకు సరిహద్దున ఉన్న కర్ణాటక భూభాగంలో షాపులు ఏర్పాటు చేస్తున్న కొందరు వ్యాపారులు.. సరుకును ఆంధ్రా మద్యం మాఫియాకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలా అక్రమంగా కర్ణాటక మద్యం కొనుగోలు చేస్తున్న వారు...సరిహద్దు దాటించి ఆంధ్రాలోకి చేర్చి జోరుగా మద్యం వ్యాపారం సాగిస్తున్నారు. అయితే సరిహద్దులో ఉన్న మద్యం షాపులకు కర్ణాటక నుంచి మద్యం సరాఫరా కావాలన్నా...ఆంధ్ర పరిధిలోని రోడ్లపైనే  వెళ్లాల్సి ఉన్నా.. ‘సెబ్‌’ అధికారులు కనీసం పట్టించుకోకపోవడం పలు విమర్శలు తావిస్తోంది. 

చెక్‌పోస్టుల్లోనూ వసూళ్లు
అక్రమ మద్యం రవాణా అడ్డుకట్ట వేయాల్సిన చెక్‌పోస్టుల్లోని కొందరు ఎస్‌పీఓలు మామూళ్లకు అలవాటు పడ్డారు.  అక్రమ మద్యం వ్యాపారులతో మామూళ్లు తీసుకుని మద్యం వాహనాలను వదిలేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా తాగేందుకు ఒకటి, రెండు బాటిళ్లు తెచ్చుకుంటే వారిని పట్టుకుని కేసులు నమోదు చేయడం, లేకపోతే వారిని భయపెట్టి భారీగా డబ్బులు వసూలు చేయడం, పట్టుకున్న మద్యాన్ని  తిరిగి షాపుల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మద్యం అక్రమ రవాణా బాటలో యువత
కర్ణాటక మద్యం విక్రయం ద్వారా ఎక్కువ లాభాలు  వస్తుండడంతో సరిహద్దు గ్రామాల్లోని యువకులు మద్యం మాఫియాగా తయారవుతున్నారు. ఒక్కో గ్రామంలో 10 మంది దాకా యువకులు కర్ణాటక మద్యం అక్రమంగా తీసుకువచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. 96 పాకెట్లు ఉన్న ఒక కేస్‌ అమ్మితే రూ. 5 వేల నుంచి రూ.7 వేల వరకు లాభం వస్తుండడంతో అడ్డదారుల్లో ద్విచక్రవాహనాల్లో కర్ణాటక మద్యం తెస్తున్నారు. అయితే ఎక్సైజ్‌ (సెబ్‌) అధికారులు అన్నీ తెలిసినా మామూళ్ల మత్తులో కళ్లుమూసుకున్నారు. ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు మాత్రం అడపాదడపా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.

దాడులు చేస్తూనే ఉన్నాం
రాయదుర్గం ఎక్సైజ్‌ కార్యాలయ పరిధిలో రోజూ దాడులు చేస్తూనే ఉన్నాం. అక్రమ మద్యంపై కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తున్నాం. అలాగే ఆంధ్రవారికి మద్యం విక్రయించవద్దని సరిహద్దులో ఉన్న మద్యం షాపులకు నోటీసులిచ్చాం. సరిహద్దులో నిఘా మరింత కట్టుదిట్టం చేస్తాం. 
– వై.పవన్‌ కుమార్‌ , సెబ్‌ అధికారి, రాయదుర్గం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement