తిరువనంతపురం: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఎం శివశంకర్ తరపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజకీయ నాయకులు పేర్లు చెప్పడానికి నిరాకరించడంతోనే తనని అరెస్ట్ చేశారని శివశంకర్ తన తరపు న్యాయవాది ద్వారా హై కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది జూలైలో యూఏఈ నుంచి వచ్చిన ఓ కార్గోలో 30 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ.. అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్పప్నసురేష్‌కి శివ శంకర్ సాయం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయనని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో శివశంకర్ న్యాయవాది మాట్లాడుతూ.. "ఈడీ స్పష్టమైన వైరుధ్యాలను సృష్టించింది. శివశంకర్ అరెస్టుకు, కస్టడీకి తగినట్లుగా వారు తమకు నచ్చినట్లు ఒక కథనాన్ని రూపొందించారు. ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది. కోర్టు ముందు వాస్తవాలను సక్రమంగా సమర్పించడానికి సంకోచిస్తుంది. ఈ విషయంలో ఈడీ ఆరోపణలని నమ్మలేం" అని తెలిపారు.
అంతేకకాక "సీనియర్ కస్టమ్స్ అధికారితో మాట్లాడానని, స్వప్న సురేష్ కోరిక మేరకు ఒక అభ్యర్థన చేశానని శివశంకర్ తన ప్రకటనలో అంగీకరించారని ఈడీ పేర్కొంది. అయితే శివశంకర్ జరిపిన సంభాషణ స్వభావానికి సంబంధించి గానీ.. శివశంకర్ ఎవరితో మాట్లాడారనే దానికి సంబంధించి గానీ నేటి వరకు ఈడీ ఎలాంటి ప్రకటన, దావా చేయలేదు. కోర్టు వాస్తవాలను అర్థం చేసుకోకుండా ఉండేందుకు గాను ఉద్దేశపూర్వకంగానే ఈడీ ఈ అస్పష్టతను సృష్టించింది" అని శివశంకర్ తరపు న్యాయవాది ఆరోపించారు. అంతేకాక శివశంకర్ అరెస్ట్ ఆర్డర్‌లో ఈడీ ఆయన ఇతర డిప్లొమాటిక్ కార్గోలను క్లియర్ చేయాలని తెలిపారని పేర్కొంది. దీన్నిబట్టి తన ఆరోపణలకు సంబంధించి ఈడీకే స్పష్టత లేదని తెలుస్తుంది అన్నారు. (చదవండి: శివశంకర్‌ను లోతుగా విచారించాలి)
న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఇక తన వాట్సాప్ చాట్‌లలో శివ శంకర్ లాక్‌ర్ గురించి గానీ.. అందులో ఉంచిన డబ్బుతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను కేవలం స్పప్న సురేష్‌ని అకౌంటెంట్‌కి పరిచయం చేశానని మెసేజ్‌లో తెలిపారు. అయితే ఈ విషయంలో తప్పుదోవ పట్టించేందుకు ఈడీ వాట్సాప్ చాట్ మొత్తాన్ని ఇవ్వలేదని.. ఒక నిర్దిష్ట మెసేజ్‌ని మాత్రమే చూపించిందని.. దానికి ముందు మెసేజ్‌లు.. దాని తర్వాత సందేశాలను కోర్టుకు సమర్పించలేదని’ ఆయన తెలిపారు. అందువల్లే ఈ ఆరోపణలు, అనుమానాలు తలెత్తాయని శివ శంకర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలానే లైఫ్ మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా శివశంకర్‌కు ముడుపులు దక్కాయనే ఆరోపణల్ని కూడా ఆయన ఖండించారు. ఆ ప్రాజెక్ట్‌కు శివశంకర్ 2018, 2019లో కొద్ది కాలం మాత్రమే సీఈఓగా పని చేశారని.. ఆయన పదివి కాలం కంటే ముందే కాంట్రాక్ట్ జరిగిపోయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment