తల్లిదండ్రులతో బాలుడు జీవా (ఫైల్)
పెదకాకాని (పొన్నూరు): దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు అడిగిన ఆగంతకులు ఇంట్లో బాలుడిని ఎత్తుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో బుధవారం చోటుచేసుకుంది. నంబూరు శివదుర్గ కాలనీ (యానాది కాలనీ)లోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తొలుత కత్తి సీమోన్ అనే వ్యక్తికి చెందిన ఇంటికి వెళ్లి కారు టైర్ పంక్చరైందని.. దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు ఇవ్వాలని అడిగారు. వారికి చెంబుతో నీళ్లు ఇచ్చిన సీమోన్ ఆ తరువాత ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు.
ఆ తరువాత కొద్దిదూరంలో ఉన్న మాణికల బాల ఇంటికి వెళ్లి తాగడానికి నీరు ఇవ్వాలని వాటర్ బాటిల్ ఇచ్చారు. బాల ఇంట్లోకి వెళ్లి వాటర్ బాటిల్‌లో నీరు నింపుతుండగా.. ఆమె రెండేళ్ల కుమారుడు జీవా ఆడుకునేందుకు బయటకు వచ్చాడు. ఆగంతకులు ఆ బాలుడిని తీసుకుని కారులో పారిపోయారు. బాల ఏడుస్తూ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమికూడారు. సమాచారం అందుకున్న పెదకాకాని సీఐ యు.శోభన్‌బాబు, ఎస్‌ఐ వై.వినోద్‌కుమార్ కాలనీకి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ జీవనం సాగించే మాణికల ముసలయ్య, బాల దంపతులకు రెండేళ్ల జీవా, ఏడేళ్ల పాప ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment