
వైర్‌ను తగులుకుని గాల్లోకి ఎగురుతూ మహిళపై పడుతున్న వ్యక్తి
కృష్ణరాజపురం: ఆటో వద్ద నిలబడిన వ్యక్తి కేబుల్ వైర్ తగిలి సినిమా స్టంట్‌లో మాదిరిగా సుమారు 10 అడుగుల ఎత్తులో ఎగురుతూ వచ్చి ఫుట్‌పాత్‌పై నడిచి వెళ్తున్న మహిళపై పడ్డాడు. దీంతో మహిళ తలకు గాయాలు తగిలాయి. ఆ పడిన వ్యక్తి సురక్షితంగా వెళ్లిపోయాడు. ఈ సంఘటన నగరంలోని కృష్ణరాజపురంలోని టీసీ.పాళ్యలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది.
వీడిన చిక్కుముడి
ఈ సంఘటన ఈ నెల 16వ తేదీన జరిగింది. సీసీ కెమెరాల వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాతో పాటు టీవీ చానెళ్లలో చక్కర్లు కొడుతోంది. కానీ ఇప్పటి వరకు ఈ సంఘటన ఎక్కడ జరిగిందని పూర్తి వివరాలు తెలియలేదు. ఈ ప్రమాదంలో గాయపడింది తానే అని టీసీ పాళ్యలో నివాసం ఉంటున్న సునీత మీడియాకు చెప్పడంతో సంఘటన చిక్కుముడి వీడింది.
గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం,తలకు గాయమైందని చెబుతున్న బాధితురాలు
రెప్పపాటులో ప్రమాదం
ఆమె 16వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఫుట్‌పాత్ మీద నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వెనుక ఆటో వద్ద ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని కాళ్ల కింద పడి ఉన్న కేబుల్‌ను దూరంగా ఎవరో లాగడంతో కేబుల్‌తో పాటు ఆటో వద్దనున్న వ్యక్తి ఎగురుతూ వచ్చి ధబేల్‌మని మహిళ మీద పడ్డాడు. ఈ హఠాత్ ఘటనతో ఆమె భయపడిపోయింది. మహిళ కూడా కిందపడడంతో తల మీద గాయాలైనట్లు తెలిపింది. తన పైన పడిన వ్యక్తి ఎవరు, తరువాత ఏమయ్యాడు అనేది తెలియదని చెప్పింది. తనకు గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారని పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణరాజపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి విచిత్ర ప్రమాదాలతో ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందోనని జనం ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment