సుత్తితో మోది..పొలంలో కాల్చేసి..  | Man Killed His Brother Wife For Property | Sakshi
Sakshi News home page

సుత్తితో మోది..పొలంలో కాల్చేసి.. 

Published Mon, May 24 2021 3:55 AM | Last Updated on Mon, May 24 2021 3:58 AM

Man Killed His Brother Wife For Property - Sakshi

నేరేడుచర్ల: పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని వదినను మరిది, అతని కుమారుడు కలసి సుత్తితో మోది చంపారు. ఆ తరువాత మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తీసుకెళ్లి పొలం వద్ద కాల్చేశారు. శనివారం అర్ధరాత్రి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నేరేడుచర్ల ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. రామాపురానికి చెందిన రేఖ బాయమ్మ (51), పిచ్చయ్య.. భార్యాభర్తలు. 2004లో పిచ్చయ్య హత్యకు గురయ్యాడు. ఈ కేసులో బాయమ్మతోపాటు ఆమె మరిది సైదులు, మరో ఇద్దరు నిందితులుగా ఉన్నారు.

ఈ కేసులో వీరు జైలు జీవితం అనుభవించారు. అప్పటి నుంచి, ఆ హత్యతో తమకు సంబంధం లేకున్నా.. కేసులో ఇరికించారని సైదులు, అతని కుమారుడు ఉపేందర్‌ బాయమ్మపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రలో ఉన్న బాయమ్మ తలపై సుత్తితో కొట్టారు. రక్తపు మడుగులో ఉన్న ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని ట్రాక్టర్‌లో బట్టువాని కుంట సమీపం లోని తమ పొలం వద్దకు తీసుకెళ్లి కాల్చివేశారు. ఆదివారం ఉదయం సైదులుతోపాటు అతని కుమారుడు ఉపేందర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.   


ఆస్తిని కాజేసేందుకే..: సైదులు తమ పొలంలో పంట పండించుకొని కౌలు కూడా ఇవ్వడం లేదని, ఆస్తిని కాజేసేందుకే తన తల్లిని దారుణంగా హత్య చేశారని బాయమ్మ కూతురు కవిత నేరేడుచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా కౌలు విషయంలో ఘర్షణ జరుగుతుండటంతో తన తల్లి భయంతో రాత్రి పూట ఇతరుల ఇళ్లలో పడుకుంటోందని, తమ తల్లిని నమ్మించి అతి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించింది. సైదులు, ఉపేందర్‌తో పాటు సైదులు భార్య ఎల్లమ్మ, చిన్న కుమారుడు హేమంత్‌పై కూడా తనకు అనుమానం ఉందని పేర్కొంది.

ఇదిలా ఉండగా బాయమ్మ చిన్న కుమార్తె శైలజను ఆమె భర్త మూడేళ్ల క్రితం హత్య చేశాడు. 2004లో బాయమ్మ భర్త హత్యకు గురయ్యాడు. ఇప్పుడు బాయమ్మను హత్య చేశారు. కాగా, ప్రస్తుత హత్యకు పాత కక్షలే కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement