
మేదరమెట్ల: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రావి హరీష్‌బాబు(31) ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పూర్ణచంద్రరావు, రమాదేవిల రెండో కుమారుడైన హరీష్‌బాబు ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని అడిలైడ్ రాష్ట్రంలో ఉంటున్నారు. మేనమామ కూతురినే వివాహం చేసుకున్నాడు. గతేడాది భార్య ప్రసవం కోసం పుట్టిల్లు అయిన ప్రకాశం జిల్లా పేర్నమిట్టకు వచ్చింది. ప్రసవం తర్వాత కరోనాతో విమాన రాకపోకలు లేకపోవడంతో తిరిగి భర్త వద్దకు వెళ్లలేకపోయింది.
ఇటీవలే విమాన రాకపోకలను పునరుద్ధరించడంతో ఆస్ట్రేలియా వెళ్లేందుకు శుక్రవారం చెన్నై విమానాశ్రయానికి వెళ్లింది. అక్కడ నుంచి భర్తకు ఫోన్ చేస్తే స్పందన లేకపోవడంతో ఆస్ట్రేలియాలో ఉండే బంధువులకు ఫోన్ చేసింది. దీంతో అక్కడకు వెళ్లిన బంధువులు హరీష్ చనిపోయి ఉండటాన్ని గమనించి భార్యకు సమాచారమిచ్చారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న హరీష్‌బాబు ఎలా చనిపోయాడో తెలియక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. మృతదేహం స్వగ్రామానికి రప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment