పోలీసులను నిలదీస్తున్న మృతుని బంధువులు.. శివాజీరావు(ఇన్‌సెట్)
గాంధారి (ఎల్లారెడ్డి): భార్య మహిళా కానిస్టేబుల్.. ఆమె ఎస్సైతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై ఎన్నిసార్లు వారించినా ఆమె పట్టించుకోలేదు. పైగా ఎస్సైతో దాడి చేయించింది. దీన్ని భరించలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు నిందితులను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నాచేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాం ధారి మండలం మాధవపల్లిలో చోటుచేసుకుంది. పోలీస్తుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర దెగులూర్ తాలూకాలోని షాకూర్ గ్రామానికి చెందిన శివాజీరావు 15 ఏళ్ల క్రితం మాధవపల్లికి చెందిన రైతు బాజారావు ఇంటికి ఇల్లరికం వచ్చాడు. బాజారావుకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రజితను శివాజీరావుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు పుట్టిన రెండేళ్లకు అనారోగ్యంతో రజిత మృతి చెందింది. దీంతో బాజారావు రెండో కూతురు సంతోషితో శివాజీరావుకు రెండో పెళ్లి చేశారు.
మూడేళ్ల క్రితం సంతోషికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి కామారెడ్డికి కాపురం మార్చారు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో సంతోషికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శివప్రసాద్ రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భర్తను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన శివాజీరావు ప్రవర్తన మార్చు కోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో సంతోషి, ఎస్సై కలిసి శివాజీరావును మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి నుంచి మాధవపల్లికి వచ్చిన శివాజీరావు తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. గాంధారి ఎస్సై శంకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
గ్రామస్తుల ధర్నా
సమాచారం అందుకున్న సంతోషి కామారెడ్డి నుంచి గ్రామానికి చేరుకుంది. శివాజీరావు బంధువులు పెద్ద సంఖ్యలో మంగళవారం అర్ధరాత్రి గ్రామానికి వచ్చారు. అతని చావుకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని పట్టుపట్టారు. పోలీసులు ఎవరి కంట పడకుండా సంతోషిని దొడ్దిదారిన పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోపోద్రిక్తులైన మృతుని బంధువులు ప్రధాన రహదారిపై రాళ్లు అడ్డంగా వేసి ధర్నా చేశారు. బుధవారం ఉదయం 10 వరకు ఆందోళన కొనసాగింది. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు చెప్పడంతో ఆందోళన విరమించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment