‘‘ఒడిశాకు చెందిన అనంత కుమార్ బారిక్ బాలానగర్‌లో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు తనిఖీ చేయగా 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లు బయటపడ్డాయి. ఒడిశా నుంచి వీటిని తీసుకొచ్చి విద్యార్థులకు, కూలీలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.’’ ‘‘ఇటీవల చర్లపల్లిలోని పాన్ డబ్బాలో ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టి 18 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాదీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి వీటిని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.’’
సాక్షి, హైదరాబాద్: ... ఇలా పాఠశాల విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయదారులు దందా కొనసాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారులు, కొత్త రుచులతో మత్తులో దించుతున్నారు. తొలుత ఉచితంగా అందించి వ్యసనంగా మారిన తర్వాత ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పిప్పి నుంచి చాక్లెట్లుగా..
గంజాయి నుంచి హాష్ ఆయిల్ తీసిన తర్వాత పిప్పి మిగులుతుంది. ఈ పిప్పిని వృథాగా పారేయకుండా దానికి కొన్ని రసాయనాలు, ద్రవ రూప చాక్లెట్ల మిశ్రమాన్ని కలిపి వీటిని తయారు చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో విక్రయించే ఐస్‌క్రీమ్‌లపై హాష్ ఆయిల్ చల్లి ఇవ్వడం, చాకెట్లలో మధ్యలో ఉంచి తక్కువ ధరకు విక్రయించడం చేస్తున్నారు. కొన్నిసార్లు కస్టమర్లను పెంచుకోవడానికి ఉచితంగా కూడా అందిస్తున్నారు.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా..
ఈ గంజాయి చాక్లెట్లను గల్లీలోని చిన్న చిన్న దుకాణాలు, పాన్‌షాపులు, కిరాణా కొట్లలో విక్రయిస్తుంటారు. బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి నిర్మాణ రంగంలో వలస కూలీలు వీటిని అక్రమ మార్గంలో వీటిని నగరానికి తీసుకొస్తున్నారు. ఈ చాక్లెట్లు బంగారం, పసుపు రంగులో ఉంటాయి. 5 గ్రాములు బరువు ఉండే ఒక్క చాక్లెట్‌ను రూ.15–20 విక్రయిస్తున్నారు. ఇందులో 14 శాతం గంజాయితో పాటు ఇతర పదార్థాలుంటాయి.
చారి్మనార్ గోల్డ్ పేర్లతో..
చారి్మనార్ గోల్డ్, చారి్మనార్ గోల్డ్ మునక్కా, వంటి స్థానిక పేర్లతో ఈ గంజాయి చాక్లెట్లను బ్రాండింగ్ చేస్తున్నారు. ఆయుర్వేదిక్ ఔషధం అంటూ ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. చూసేవాళ్లకు అవి గంజాయి చాక్లెట్లు అని ఏమాత్రం అనుమానం కలగకుండా విక్రయదారులు ఈ ఎత్తుగడ వేస్తున్నారని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment