ఫిర్యాదు రాగానే స్పందించిన టీజీసీఎస్‌బీ
బ్యాంకులను అప్రమత్తం చేసి రూ.1.10 కోట్లు రికవరీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఓ మహిళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలాంటి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) లేకుండానే రూ.1.90 కోట్లను కేటుగాళ్లు కొట్టేశారు. బ్యాంకు నుంచి డబ్బు డెబిట్ అయినట్లు ఫోన్‌లో మెసేజ్ రాగానే ఆ మహిళ అప్రమత్తమై 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తన ప్రమేయం లేకుండా ఈ ఘటన జరిగిందని తెలిపారు.
1930 కాల్ సెంటర్‌లో ఏజెంట్ కాల్ రిసీవ్ చేసు కుని వెంటనే బ్యాంకింగ్ ఫాలోఅప్ బృందాన్ని అలర్ట్ చేశారు. రంగంలోకి దిగిన బృందం మహిళ బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్‌లో జమ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆ బ్యాంకు అధికారులతో మాట్లాడి అక్కడున్న రూ.75,69,223లను స్తంభింప చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మరో రూ.35 లక్షలు వివిధ బ్యాంకులకు బదిలీ అయినట్లు గుర్తించి ఆ బ్యాంకుల నిధులను కూడా హోల్డ్‌లో పెట్టించారు. ఈ విధంగా రూ.1.90 కోట్ల నిధుల్లో నుంచి రూ.1,10,70,000లను కేటుగాళ్ల నుంచి రికవరీ చేయగలిగినట్లు రాష్ట్ర సైబర్ క్రైమ్ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ వెల్లడించారు.
మిగిలిన రూ.79.30 లక్షల విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నవారు ఒకట్రెండు గంటల్లోనే (గోల్డెన్ హవర్స్) ఫిర్యాదు చేయాలని ఆమె ప్రజలకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment