
సాక్షి, హైదరాబాద్: వివాహం అయ్యిందని తెలిసే తనను పెళ్లి చేసుకున్న భర్త ప్రస్తుతం వేధిస్తున్నాడని ఏఆర్ కానిస్టేబుల్ సంధ్య రాణి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. సంధ్య రాణిపై ఆమె భర్త చరణ్ తేజ్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
తనకు వివాహం అయిన సంగతి తెలిసే పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాత తనను దూరం పెడుతున్నాడని సంధ్య రాణి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక భర్త చరణ్ తేజ్ తనను కులం పేరుతో దూషించి, వేధింపులకు గురి చేస్తున్నట్లు సంధ్య రాణి ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో పోలీసులు చరణ్ తేజ్‌పై ఐపీసీ 498ఏ, 506, వరకట్న నిరోధక చట్టంతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇక చరణ్ తేజ్ సంధ్యా రాణికి గతంలోనే రెండు వివాహాలు అయ్యాయని.. ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు తల్లిదండ్రులు, స్నేహితులను కలవనీయకుండా చేస్తోందన్నారు. సంధ్యారాణి కుటుంబం నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ శంషాబాద్ డీసీపీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
చదవండి: పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు