ఎన్‌ఆర్‌ఐ ఫ్యామిలీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఎన్‌ఆర్‌ఐ కుటుంబంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. విషయం తెలుసుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అపార్టుమెంట్‌లో స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించారు. స్థానికంగా లభించిన ఆధారాల ప్రకారం పెద్ద కుమారుడే తల్లిదండ్రులతోపాటు సోదరుడిని చంపి తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో గల ఆదిత్య ఫార్చూన్ టవర్స్ అపార్ట్‌మెంట్ ఐదో ఫ్లోర్ 505 ఫ్లాట్‌లో సుంకరి బంగారు నాయుడు(50), భార్య డాక్టర్ నిర్మల, ఇద్దరు కుమారులు దీపక్ (22), కశ్యప్ (19)లతో కలిసి నివాసముంటున్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామానికి చెందిన బంగారునాయుడు బహ్రెయిన్‌లో కొన్నేళ్ల పాటు వ్యాపారం చేసి నాలుగేళ్ల క్రితం విశాఖ వచ్చారు. 8 నెలల క్రితం ఆదిత్య ఫార్చూన్ అపార్ట్‌మెంట్‌లోకి అద్దెకు వచ్చారు. నాయుడు పెద్ద కుమారుడు దీపక్ (22) నిట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు.
ఫ్లాట్‌లో అరుపులు, కేకలు
బుధవారం రాత్రి నాయుడు కుటుంబంలో గొడవ జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫ్లాట్ నుంచి పెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి. ఇంట్లో సామానులు విసురుకున్నట్లు శబ్దాలు వచ్చాయి. అపార్టుమెంట్ వాసులందరికీ నాయుడు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతోందన్న విషయం అర్థమైంది. కానీ కుటుంబ వ్యవహారం కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కొంత సేపటికి అరుపులు ఆగిపోయాయి.
ఒక్కసారిగా దట్టమైన పొగలు
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అపార్టుమెంట్ 5వ అంతస్తు నుంచి పొగలు దట్టంగా వస్తున్న విషయాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 5 గంటల సమయంలో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది తలుపులు పగులగొట్టారు. మంటలను అదుపు చేసి లోపలకు వెళ్లి చూడగా కుటుంబ సభ్యులు నలుగురు మృతి చెంది ఉన్నారు. ఇంతలో పోలీసులు కూడా అక్కడకు చేరుకొని పరిస్థితిని గమనించారు. క్లూస్ టీమ్ కూడా వచ్చి ఆధారాలు సేకరించింది. ఎన్‌ఆర్‌ఐ కుటుంబం మరణానికి అగ్ని ప్రమాదం కారణమా? లేదా ఎవరైనా వారిని హత్య చేశారా? అని విచారణ చేపట్టారు. అపార్టుమెంట్ వాసుల నుంచి సమాచారాన్ని సేకరించారు. అలాగే వారి ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి పరిశీలించారు.
దీపక్ మానసిక స్థితిపై అనుమానాలు?
ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న బంగారునాయుడు పెద్దకుమారుడు దీపక్ మానసిక పరిస్థితిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదువు కారణంగా దీపక్ తీవ్ర ఒత్తిడికి గురై మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడని పోలీసుల విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం. మానసిక ఇబ్బందులతో ఉన్న దీపక్ కుటుంబ సభ్యులతో గొడవకు దిగి వారిని హతమార్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్ద కుమారుడే హంతకుడా?
గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్ కావడంతో బయట నుంచి ఇతర వ్యక్తులు లోపలకు వచ్చే అవకాశం లేదు. సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో బుధవారం రాత్రి 8.56 గంటలకు ఆ ఇంటికి చివరగా బంగారు నాయుడు మాత్రమే వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. బంగారునాయుడుతోపాటు అతని భార్య నిర్మల, చిన్న కుమారుడు కశ్యప్ శరీరాలపై కత్తి గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెద్దకుమారుడు దీపక్ శరీరంపై గాయాలు లేవు. దీంతో బుధవారం రాత్రి కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగడంతో దీపక్ తల్లిదండ్రులను, సోదరుడిని కత్తితో హత్య చేసి, అనంతరం తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.
దీపక్ మినహా ముగ్గురి శరీరాలపై గాయాలున్నాయి: సీపీ
ఆదిత్య టవర్స్‌లో ఘటనాస్థలిని పరిశీలించిన సీపీ మనీష్‌కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఆదిత్య టవర్స్ ఫ్లాట్ 505లో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఇంట్లో ఘర్షణ జరుగుతున్నట్లు చుట్టుపక్కలవారు తెలిపారు. సీసీ ఫుటేజ్‌ను కూడా పరిశీలించాం. కుటుంబ సభ్యులపై పెద్దకుమారుడు దీపక్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసి.. దీపక్ కూడా సజీవ దహనం చేసుకున్నట్లుగా అనుమానం వ్యక్తం అవుతోంది. దీపక్ మానసిక సమస్యతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నాం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment