చండీగఢ్: హర్యానా అల్లర్లలో నిందితుడు అమిర్‌ను అదుపులోకి తీసుకున్నారు హర్యానా పోలీసులు. ఆరావళి పర్వతాల్లో దాగిన అమిర్ పోలీసులను చూడగానే కాల్పులు జరపగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో గాయపడి పోలీసులకు చిక్కాడు. గాయపడిన అతడిని ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. నిందితుడి నుండి ఒక దేశవాళీ తుపాకీ తోపాటు ఐదు కేట్రిడ్జ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
హర్యానా అల్లర్లలో ప్రధాన సూత్రధారుల కోసం హర్యానా పోలీసులు ఆరావళి పర్వతశ్రేణుల్లో వేట మొదలుపెట్టారు. ఆరావళి పర్వతాల్లో నక్కిన దుండగులను పట్టుకునే క్రమంలో విస్తృతంగా గాలిస్తుండగా తౌరు ప్రాంతంలో అమిర్ హర్యానా పోలీసులు వస్తుండటాన్ని గమనించి అనుచరులతో కలిసి వారిపై కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో అమిర్ కాలిలోకి బులెట్ దూసుకుపోయింది.
దిధారా గ్రామానికి చెందిన అమిర్‌పై ఢిల్లీ పరిధిలో సుమారు 100 కేసులున్నాయని అతడిపై రూ.25,000 నగదు బహుమతిని కూడా ప్రకటించినట్లు తెలిపారు ఢిల్లీ పోలీసులు. ఇతర నిందితులను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎన్‌కౌంటర్ జరిగిందని తెలిపారు పోలీసులు.
ఇక ఈ అల్లర్లలో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిట్టు బజరంగ్, మోను మానేసర్‌లు రెచ్చగొట్టడం వల్లనే ఈ హింస చెలరేగిందన్న ఆరోపణలు రావడంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిట్టు బజరంగ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మోను మానేసర్ పాత్రపై విచారణ జరుగుతోందన్నారు.
అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకు 64 ఎఫ్ఐఆర్‌లు నమోదుకాగా మొత్తం 280 మందిని అరెస్టు చేశారు. వీరితోపాటు సోషల్ మీడియాలో వదంతులను ప్రచారం చేస్తున్నందుకు మరో 12 మందిపై కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు హర్యానా పోలీసులు. ఈ సందర్బంగా నూహ్ పోలీసులు వదంతులు పుకార్లను ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
ఇది కూడా చదవండి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.21 లక్షల బంగారం పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment