జగిత్యాల క్రైం: పాత పగలు పడగ విప్పాయి. మూఢనమ్మకాలు తోడయ్యాయి. తండ్రి, ఇద్దరు కుమారులను పొట్టన పెట్టుకున్నాయి. కత్తులు, బరిశెలు పట్టుకుని వచ్చిన ప్రత్యర్థులు.. విచక్షణారహితంగా నరుకుతున్నా అక్కడున్న వారెవరూ ఆపే సాహసం చేయలేకపోయారు. జగిత్యాల జిల్లా టీఆర్‌నగర్ గ్రామంలో గురువారం ఈ దారుణం జరిగింది.
కత్తులు, బరిశెలతో ప్రవేశించి: టీఆర్‌నగర్ గ్రామంలోని ఎరుకల సంఘ భవనంలో ఆర్నెల్లకోసారి కుల సంఘం సమావేశం నిర్వహిస్తారు. గురువారం కూడా 40 నుంచి 60 మంది వరకు సమావేశమయ్యారు. కులపెద్దగా వ్యవహరించే జగన్నాథం నాగేశ్వర్‌రావు, కుమారులు రాంబాబు, రమేశ్, రాజేశ్ హాజరయ్యారు. భేటీ జరుగుతుండగా అదే గ్రామానికి చెందిన వనం దుర్గయ్య, వనం గంగయ్యతో పాటు మరికొందరు కత్తులు, బరిశెలతో లోనికి ప్రవేశిం చారు. వచ్చీరాగానే నాగేశ్వర్‌రావుపై దాడిచేశారు. అక్కడే ఉన్న రాంబాబు, రమేశ్ అడ్డుకోబోగా వారిపైనా దాడికి దిగారు. ముప్పును గమనించిన రాజేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. నిందితులు వెంబడించినా చాకచక్యంగా తప్పించుకున్నాడు. నాగేశ్వర్‌రావు(60), అతడి పెద్దకుమారుడు రాంబాబు(35) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నకుమారుడు రమేశ్ (25)ను పోలీసులు జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్పీ సింధూ శర్మ, అడిషనల్ ఎస్పీ రూపేశ్, డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్ పరిశీలించారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వేములవాడలో ముగ్గురిపై దాడి
నెల రోజుల క్రితం వేములవాడ శివారులోని అగ్రహారం గుట్ట వద్ద క్షుద్రపూజలు చేశారనే కారణంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలోని వీరి కులానికి చెందిన కొందరు.. నాగేశ్వర్‌రావు, అతడి కుమారుడు రాంబాబు, రాజేశ్‌పై దాడి చేశారు. ఈ మేరకు వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో అప్పుడు కేసు నమోదైంది. మరోవైపు తండ్రీకొడుకులు సెప్టిక్ ట్యాంక్ వాహనాలు నడిపిస్తుంటారు. వేములవాడలోనూ వీళ్లు వాహనాలు నడుపుతున్నారు. దీంతో తమ వ్యాపారం సాగట్లేదనే ఆగ్రహంతో ఎరుకల కులస్తులు వీరిని అప్పుడు హత్య చేసేందుకు యత్నించగా తండ్రీకొడుకులు తప్పించుకున్నారు.
మంత్రాలు, కులంలో పెత్తనం చెలాయిస్తున్నారనేనా?
హత్యలకు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంత్రాలు చేస్తున్నారని, కులంలో పెత్తనం చెలాయిస్తున్నారనే కారణంతో కులస్తులు పథకం ప్రకారం ఏకమై నాగేశ్వర్‌రావు, ఇద్దరు కుమారులను పథకం ప్రకారం అంతమొందించారని అనుమానిస్తున్నారు.
వార్డు సభ్యుడిగా ఓడిన నాగేశ్వర్‌రావు
నాగేశ్వర్‌రావు దాదాపు 20 ఏళ్లుగా కుల సంఘం పెద్దమనిషి కొనసాగుతున్నారు. గతంలో మున్సిపల్ 48వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
60 మంది చూస్తుండగానే..ముగ్గురి హత్య..! మూఢనమ్మకాలే..
Published Fri, Jan 21 2022 3:10 AM | Last Updated on Fri, Jan 21 2022 3:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment