శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులు (ఫైల్)
సాక్షి, పొందూరు, ఎచ్చెర్ల క్యాంపస్: అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన దంపతులను మృత్యువు మింగేసింది. దైవ దర్శనానికి వెళ్లిన అమ్మానాన్నలు ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్న కుమార్తెలకు ఆఖరకు వారి చావు కబురు అందింది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. పొందూరు మండలంలోని రెడ్డిపేట వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెంకు చెందిన బనిశెట్టి శ్రీనివాసరావు(46), భార్య అన్నపూర్ణ(40) అనే దంపతులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు..
చిలకపాలెంకు చెందిన బనిశెట్టి శ్రీనివాసరావు వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. ఆయన భార్య అన్న పూర్ణ రిమ్స్‌లో హౌస్ కీపర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పొందూరులోని పైడితల్లి దర్శనం కోసం మంగళవారం ఈ దంపతులు తమ టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై బయల్దేరారు. అమ్మవారి దర్శనం అనంతరం పొందూరు నుంచి వస్తుండగా రెడ్డిపేట వద్ద భారీ లారీని చూసి పక్కకు తప్పుకున్నారు. అయితే ఆ క్రమంలో వీరి బండికి లారీ టైరు తగలడంతో ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. వారి తలలపై నుంచి లారీ టైర్లు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆ దృశ్యాలు భీతావహంగా మారాయి.
చదవండి: (ఆస్పత్రిలో గర్భిణీ మృతి.. అవమానం తట్టుకోలేక మహిళా వైద్యురాలు)
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ ఎస్.లక్ష్మణరావు సిబ్బందితో వెళ్లి మృతదేహాల ను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు మృతి చెందిన విషయాన్ని కుమార్తెలకు చెప్పారు. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన వీరు 15 ఏళ్ల క్రితం చిలకపాలేంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మానాన్న వస్తారని ఎదురు చూసి న కుమార్తెలు సంధ్య, స్నేహలకు ఆఖరుకు వారి మృతదేహాలు చూడాల్సి రావడంతో గుండెలవిసేలా రోదించారు. స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment