విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీ ఎన్.శ్వేత
సిద్దిపేట కమాన్: సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసును సిద్దిపేట పోలీసులు ఛేదించారు. చెడు అలవాట్లకు బానిసై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రూ.43.50 లక్షలు దోచుకెళ్లిన ఈ ఘటనపై సిద్దిపేట పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వీరి నుంచి రూ.34 లక్షలు రికవరీ చేసి, మూడు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు సీజ్ చేశారు. ఈ కేసు వివరాలను సోమవారం పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వకులాభరణం నర్సయ్య తన ప్లాట్‌ను శ్రీధర్‌రెడ్డికి విక్రయించాడు. రిజిస్ట్రేషన్ చేయడానికి జనవరి 31న సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఇద్దరూ వచ్చారు. ప్లాట్ కొనుగోలుదారుడు చెల్లించిన రూ.43.50 లక్షల నగదు బ్యాగును నర్సయ్య తన కారు డ్రైవర్‌కు ఇచ్చి కార్యాలయంలోనికి వెళ్లాడు.
ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గన్‌తో డ్రైవర్‌పై కాల్పులు జరిపి నగదుబ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు ఆదివారం ఎడమ సాయికుమార్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మిగతా ముగ్గురు నిందితులు గజ్జె రాజు(26), బలిపురం కరుణాకర్ (28), సికింద్రాబాద్‌లోని చాచా నెహ్రూనగర్‌కు చెందిన బిగుళ్ల వంశీకృష్ణ (20)లను అదుపులోకి తీసుకున్నారు.
పాత నేరస్థులే...
ప్రధాన నిందితుడైన సిద్దిపేట జిల్లా కొం డపాక మండలం మంగోల్‌కి చెందిన గజ్జె రాజు(26) మేడ్చల్ జిల్లాలోని బండ్లగూడలో నివాసముంటున్నాడు. రాజుకు బండ్లగూడకు చెందిన ఎడమ సాయికుమార్(22) సమీప బంధువు. వీరిపై సిద్దిపేట వన్‌టౌన్ పోలీసులు 2021, ఆగస్టులో పోక్సోచట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. సెప్టెంబర్‌లో బెయిల్‌పై బయటకు వచ్చారు. జల్సాలకు అలవాటు పడిన వీరికి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని ఈ ఘటనకు పాల్పడ్డారు.
గన్‌పై ఆరా
కాల్పుల ఘటనలో ఉపయోగించిన గన్‌ను నిందితులు ఎక్కడ, ఎప్పుడు కొనుగోలు చేశారు.. ఇంతకు ముందు ఎక్కడైనా దానిని వినియోగించారా, ఈ కేసులో ప్లాటు క్రయ విక్రయదారుల ప్రమేయం ఉందా? లేదా ? అనే విషయాలపై దర్యాప్తు కోసం సిద్దిపేట ఏసీపీ చల్లా దేవారెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment