
సాక్షి, బెంగళూరు: మాజీమంత్రి రమేశ్ జార్కిహొళి శృంగార బాగోతం సీడీ కేసులో ముఖ్య నిందితులను ఇప్పటికీ సిట్ పోలీసులు పట్టుకోలేకపోయారు. యువతితో సహా ఐదుగురి కోసం ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో అన్వేషించినా ఫలితం లేదు. నిందితులు తరచుగా ప్రాంతాలు మారుస్తూ సంచరిస్తుండడంతో జాడ గుర్తించడం కష్టంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. పగలు విశ్రాంతి తీసుకుని రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. పాత మొబైల్ నంబర్లను పక్కనపెట్టి కొత్త కొత్త నంబర్లతో కాల్స్ చేసుకుంటున్నారు. డబ్బుల కోసం, వస్తు కొనుగోళ్లకు ఏటీఎం, క్రెడిట్ కార్డులను వాడడం లేదు. వాడి ఉంటే ఇప్పటికే ఆచూకీ తెలిసి ఉండేది. మరి ఖర్చులకు డబ్బులు ఎలా వస్తున్నాయనేది ఖాకీలకు మిస్టరీగా మారింది. నిందితులందరూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.
జార్కిహొళి అసంతృప్తి?..
కేసు నత్తనడకన నడుస్తోందని మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి, ఆయన సోదరులు అసంతృప్తితో ఉన్నారు. సీడీ బాగోతం వల్ల కుటుంబ పరువు మంటగలిసిందని, త్వరగా నిజాలు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విచారణ దారితప్పిందని జార్కిహొళి సోదరులు సన్నిహితులతో వాపోయినట్లు తెలిసింది. సిట్ ఇప్పటికీ ముఖ్య అనుమానితులను పట్టుకోకపోవడాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే రెండుమూడుసార్లు తనను విచారించడం, ఆ వివరాలు లీక్ కావడంపై రమేశ్ కంగుతిన్నట్లు తెలిసింది. విచారణ తీరుపై త్వరలో హోం మంత్రి బసవరాజబొమ్మైని కలవాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment