బేస్తవారిపేట/ఆగిరిపల్లి: నూతన సంవత్సరం వేళ ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలంలోని పాపాయిపల్లెకు చెందిన నల్లబోతుల పవన్‌కళ్యాణ్ (19), పిక్కిలి రాహుల్ (19), గుజ్జుల శ్రీనివాసులు (20) స్నేహితులు. వీరు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై గిద్దలూరు వైపు వెళ్తున్నారు.
అదే సమయంలో గిద్దలూరు నుంచి కంభం వైపు బొలేరో వాహనం (లగేజీ ట్రక్) వెళ్తోంది. బేస్తవారిపేట మండలంలోని చెట్టిచర్ల బస్టాండ్ సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేపై బొలేరో, మోటార్ సైకిల్ వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు వ్యాపించాయి. బైక్‌పై ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్‌పై పెట్రోల్ పడటంతో అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. బైక్‌పై ఉన్న రాహుల్, శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.
మోటార్ సైకిల్, బొలేరో వాహనం రెండూ మంటల్లో దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. సమాచారం అందుకున్న బేస్తవారిపేట ఎస్సై బి.నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కంభం అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మృతదేహాలను కంభం ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పాపాయిపల్లె తీసుకెళ్లారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఏలూరు జిల్లాలో బైక్ నేలబావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామంలో బైక్ నేలబావిలో పడి ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన ఘటన సోమవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన తలశిల కృష్ణ చైతన్య (24), నున్న గ్రామానికి చెందిన శెట్టి సాయికుమార్ (24), నున్న రాకేష్ (25), మరో ఇద్దరు స్నేహితులతో కలసి ఆదివారం కనసానపల్లిలోని రాకేష్ మామిడి తోటలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
ఉదయం కృష్ణచైతన్య, సాయికుమార్, రాకేష్ ఒకే బైక్‌పై తిరిగి ఇంటికి వెళుతుండగా, గేదె అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న నేలబావిలోకి దూసుకుపోయింది. వీరి వెనుకే మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు స్నేహితులు గమనించి వెంటనే కనసానపల్లి సర్పంచ్ అమ్మిశెట్టి సంజీవరావు సాయంతో వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
అప్పటికే నీటిలో మునిగిపోవడంతో కృష్ణ చైతన్య, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. రాకేష్‌ను బయటకు తీసి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment