బాషా(ఫైల్)
నెల్లూరు(క్రైమ్): పాతక్షల నేపథ్యంలో ఓ రౌడీషీటర్‌ను కొందరు దారుణంగా హత్యచేసి పరారయ్యారు. ఈ ఘటన నగరంలోని సీఏఏం హైస్కూల్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. సీఏఎం హైస్కూల్ సమీపంలో రౌడీషీటర్ బాషా (32) నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య నసీమా, పిల్లలు సమీర్, సనా ఉన్నారు. బాషా వంట పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు పలువురితో వివాదాలు ఉన్నాయి. పలు పోలీసు స్టేషన్‌లలో కేసులు సైతం ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఓ మహిళ విషయంలో కోటమిట్ట ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ మొహిసీన్‌పై చేయిచేసుకున్నాడు. అప్పట్నుంచి ఇరువురి నడుమ తరచూ వివాదాలు నడుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మొహిసీన్ వారం రోజుల క్రితం ఇకపై గొడవలు వద్దని స్నేహంగా ఉందామని బాషాతో రాజీ చేసుకున్నాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన బాషా స్నేహంగా మెలగసాగాడు. ఈ క్రమంలో బాషా తన ఇంటి సమీపంలోని తన షెడ్‌లో మొహిసీన్, అతని స్నేహితులైన జాన్సన్, సమీర్, ఫరూఖ్, ప్రేమ్‌తో పాటు తన అనుచరుడైన కార్తీక్‌తో కలిసి గురువారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. కార్తీక్ సిగిరెట్లు తెచ్చేందుకు బయటకు వెళ్లగా, బాషా ఇంటికి వచ్చి రెండు వాటర్ బాటిళ్లు తీసుకుని షెడ్‌కు వెళ్లారు. కొద్దిసేపటికే మొహిసీన్, అతని స్నేహితులు విచక్షణా రహితంగా కత్తులతో బాషా గొంతుకోయడంతో పాటు ముఖంపై బలంగా పొడిచారు. బాషా కేకలు విన్న భార్య, కుమారుడు సమీర్, అత్త షరీఫా, సోదరుడు మస్తాన్, మరికొందరు షెడ్‌వద్దకు వెళ్లేసరికి దుండగులు పరారయ్యారు. తీవ్రగాయాలపాలైన బాషా అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. .
పథకం ప్రకారమే హత్య
నిందితులు పథకం ప్రకారమే బాషాను హత్యచేసినట్లుగా తెలుస్తోంది. వారం రోజుల క్రితం బాషాతో మొహిసీన్ గొడవలు లేకుండా కలిసి ఉందామని రాజీ చేసుకున్నాడు. అçప్పట్నుంచి మొహిసీన్, అతని స్నేహితులు రోజూ బాషాను కలిసి అర్ధరాత్రి వరకు మాట్లాడి వెళ్లేవారు. మూడ్రోజులుగా అందరూ కలిసి బాషాకు చెందిన షెడ్‌లో అర్ధరాత్రి వరకు మద్యం సేవించేవారు. బాషా ప్రతి కదలికను నిందితులు నిశితంగా పరిశీలిస్తూ అనుమానం రాకుండా తుదముట్టించేందుకు అదనుకోసం వేచిచూడసాగారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి కార్తీక్ బయటకు వెళ్లడం, బాషా కుటుంబ సభ్యులు ఇంట్లో తలుపులు వేసుకుని ఉండడంతో ఇదే అదనుగా భావించిన మొహిసీన్, అతని స్నేహితులు బాషాను కిరాతకంగా హత్యచేశారు. బాషా కేకలు విని కుటుంబ సభ్యులు, కార్తీక్ అక్కడికి చేరుకోవడంతో చేతిలోని కత్తి పడిపోయినా పట్టించుకోకుండా నిందితులు పరారయ్యారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇన్‌స్పెక్టర్లు
బాషా హత్యపై సమాచారం అందుకున్న చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ ఎం మధుబాబు, సంతపేట ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా, ఎస్సై అలీసాహెబ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను మృతుడి భార్య నసీమాను అడిగి తెలుసుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు మొహిసీన్, అతని స్నేహితులపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్టుమార్టం చేయించారు. చిన్నబజారు ఇన్‌స్పెక్టర్ మధుబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి పరారీలో ఉండడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment