రాజీవ్ రహదారిపై ఆందోళనకారుల నిరసన
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
పోలీసుల అదుపులో నిందితుడు.. పోక్సో కేసు నమోదు
గంజాయి మత్తులో రాక్షసం
బహిరంగంగా శిక్షించాలని తల్లిదండ్రులు, బంధువుల ధర్నా
సాక్షి, పెద్దపల్లి, సుల్తానాబాద్/సుల్తానాబాద్ రూరల్: గంజాయి మత్తులో ఓ మానవ మృగం రెచ్చిపోయింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణ హత్యకు ఒడిగట్టింది. జిల్లావాసులను ఉలికిపాటుకు గురిచేసిన ఈ దారుణ ఘటనపై స్థానికులు, పోలీసుల కథనమిలా.. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలానికి చెందిన దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్ మిల్లులో నెలరోజులుగా కూలి పనికి కుదిరారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సమీప మరో మిల్లులో హమాలీగా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వలసకూలీ వినోద్ మాజ్హి ఆరేళ్ల చిన్నారిపై కన్నేశాడు.
ఈ క్రమంలో గురువారం రైస్‌మిల్లు ఆవరణలో కూలీల కోసం నిర్మించిన గదుల ఎదుట బాలిక తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తోంది. గురువారం రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో పాపతో కలిసి దంపతులు ఇంట్లోకి వెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోత భరించలేక దంపతులు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నిందితుడు చీకట్లో పాపను అపహరించాడు. అదే రైస్‌మిల్లు వెనకాల ఉన్న పంట పొలాల్లోకి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తన బండారం బయటపడుతుందని భావించి పాప గొంతు నలిమి చంపి అక్కడే పొదల్లో పడేశాడు. కాగా, కొద్దిసేపటికి ఇంట్లోకి తల్లిదండ్రులు వచ్చి చూడగా.. ఓ పాప కనిపించలేదు. ఆందోళనతో సమీపంలో వెతికినా.. కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెట్రోలింగ్ పోలీసులకు చిక్కిన నిందితుడు
ఈ క్రమంలోనే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు.. గురువారం రాత్రి (శుక్రవారం వేకువజామున) సుమారు 2గంటల సమయంలో నిందితుడు వినోద్ మాజ్హి మిల్లు వద్ద తన బట్టలకు అంటిన మరకలను శుభ్రం చేస్తూ కనిపించాడు. అనుమానం వచి్చన పోలీసులు.. అతడిని విచారించగా విషయం మొత్తం చెప్పినట్లు తెలుస్తోంది. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పాప మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు పాపను తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. డాగ్‌స్కా్వడ్ బృందం తనిఖీల్లో మరో ఇద్దరు నిందితులను అనుమానితులుగా గుర్తించగా పోలీసులు వారిని సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. మరోవైపు.. రాత్రి ముగ్గురూ కలిసి మద్యం, గంజాయి తాగామని, ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయామని, ఆ ఘటనతో తమకు సంబంధంలేదని ఇద్దరు అనుమానితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. కాగా, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దద్దరిల్లిన తెలంగాణ చౌక్
అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి, హతమార్చిన ఘటనలో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ప్రజాసంఘాల నాయకులు తెలంగాణ చౌక్‌లోని రాజీవ్ రహదారితోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్ట్‌మార్టం గది ఎదుట బైఠాయించారు. చిన్నారిపై అఘాయిత్యం చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని, బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటపాటు ధర్నా చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను సముదాయించారు.
Comments
Please login to add a commentAdd a comment