ములుమూడి సుబ్బరామిరెడ్డి(ఫైల్)
కోవూరు(నెల్లూరు జిల్లా): పడుగుపాడు సొసైటీ చైర్మన్ ములుమూడి సుబ్బరామిరెడ్డి (59) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం తెట్టు సమీపంలో రైల్వేట్రాక్ పక్కన ఆయన మృతదేహాన్ని కావలి రైల్వే పోలీసులు గురువారం గుర్తించారు. సుబ్బరామిరెడ్డి కోవూరులోని కాపువీధిలో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చారు. సాయంత్రం వరకు ఇంటికి వెళ్లలేదు. సెల్‌ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో భార్య లక్ష్మీప్రసన్న అనుమానంతో రాత్రి కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తెట్టు వద్ద రైల్వే ట్రాక్‌పై సుబ్బరామిరెడ్డి మృతదేహాన్ని కావలి రైల్వే పోలీసులు గురువారం గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కోవూరు ఎస్సై చింతం కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతిపై ఆరా తీశారు.
ఆర్థిక లావాదేవీలే కారణం?
కోవూరులో ములుమూడి సుబ్బరామిరెడ్డికి వివాదారహితుడిగా పేరు ఉంది. ఆయన కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ ఉమ్మడి భూమికి సంబంధించిన విషయంలో చిన్నపాటి గొడవలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆయన సోదరుడు ములుమూడి సీతారామిరెడ్డి గతంలో సన్నపురెడ్డి శ్రీనివాసనారాయణరెడ్డి వద్ద అప్పు చేశారు. ఈ విషయమై ఇరువర్గాల వారు 2014లో పోలీస్‌స్టేషన్‌లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సుబ్బరామిరెడ్డికి సంబంధించిన భూమి లోని జామాయిల్ తోటను సన్నపురెడ్డి శ్రీనివాసనారాయణరెడ్డి నరికివేశారు. ఆ సమయంలో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో సుబ్బరామిరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై ఆర్థిక లావాదేవీలే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
కోవూరులో పోలీసు బందోబస్తు
ములుమూడి సుబ్బరామిరెడ్డి అనుమానాస్పద మృతి నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని కోవూరులో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామారావు ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment