సాక్షి, నెల్లూరు: గుర్రాలమడుగు సంఘం చిన్నారి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. నాలుగు రోజుల కిందట ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి ప్లేస్‌లో ఓ బొమ్మ ఉంచి.. పాపను ఎత్తుకెళ్లిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. అయితే.. చిన్నారి హారిక ఆచూకీ కోసం చేపట్టిన గాలింపులో చివరికి ఆమె మృతదేహం లభ్యం అయ్యింది.
సర్వేపల్లి కాలువలో చిన్నారి హారిక మృత దేహం లభ్యం అయ్యింది. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం అర్థరాత్రి దాటాక గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. దీంతో.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మరోవైపు ఈ మిస్సింగ్ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కచ్చితంగా రక్త సంబంధీకుల పనే అయ్యి ఉంటుంది భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల విచారణలో అందిన సమాచారం మేరకే కాలువలో గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి.. పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
గుర్రాలమడుగు సంఘానికి చెందిన అనూష, రావూరుకు చెందిన మణికంఠకు నాలుగేళ్ల కిందట వివాహం అయ్యింది. వీళ్లకు ఇద్దరు కూతుళ్లు. మణికంఠ హోటల్ నడుపుతుండగా. అనూష భర్తకు దూరంగా ఉంటూ ఎంసీఏ చదువుతూ గుర్రాల మడుగు సంఘంలోనే ఉంటోంది. భర్త మణికంఠ అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలను చూసి పోతుంటాడు. ఈ క్రమంలో.. ఆదివారం తన తల్లి బయటకు వెళ్లడంతో.. దగ్గర్లో ఉన్న తన పిన్ని ఇంటికి పిల్లలతో వెళ్లింది అనూష. అర్ధరాత్రి కరెంట్ పోవడంతో డోర్లు తీసి పడుకుందామె. ఉదయం లేచి చూసేసరికి.. ఊయలలో ఏడాదిన్నర వయసున్న హారికకు బదులు.. బొమ్మ ఉంది. దీంతో ఆందోళనకు గురై భర్తకు సమాచారం అందించగా.. అంతా కలిసి చుట్టుపక్కల గాలించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్నారిని బలి తీసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment