నెల్లూరు(క్రైమ్): పెయింటర్ షేక్ సుబహాన్ అలియాస్ బత్తల చిన్న(39) రాళ్లపై పడడం వల్ల అయిన గాయాలతో మృతి చెందలేదని, ఆయనను భార్య, బావమరుదులు హత్యచేశారని వేదాయపాళెం పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పీవీ నారాయణ తెలిపారు. సోమవారం ఆయన వేదాయపాళెం పోలీసుస్టేషన్‌లో హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలను విలేకరులకు వెల్లడించారు. వివరాలు..గాందీనగర్‌లో షేక్ సుబహాన్(39), అబీదా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సుబహాన్ పెయింట్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 7న రాత్రి సుబహాన్ రెవెన్యూకాలనీ చివరలో తీవ్రగాయాలతో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.
అతని భార్యకు సమాచారం అందించగా భర్తను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా సుబహాన్ మార్గం మధ్యలో మృతిచెందారు. తన భర్త మద్యం మత్తులో రాళ్లపై పడడంతో మృతి చెందాడని అప్పట్లో అబీదా వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై రాజ్‌కుమార్ కేసు నమోదు చేశారు.
ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో లోతుగా దర్యాప్తు చేయగా వేధింపుల నేపథ్యంలో సుబహాన్‌ను బావమరుదులు, భార్య కలిసి హత్యచేసినట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు కేసును హత్యకేసుగా మార్పు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నిందితులు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బైక్‌ను స్వా«దీనం చేసుకున్నారు.
వేధింపులు తాళలేక...
సుబహాన్‌కు మద్యం అలవాటు ఉంది. మద్యం మత్తులో భార్యను తీవ్రంగా వేధించేవాడు. పలుమార్లు పద్ధతి మార్చుకోమని బావమరుదులైన షేక్ మహమ్మద్, షేక్ గౌస్‌బాషా సూచించినా పెడచెవిన పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7న సాయంత్రం సుబహాన్ మద్యం మత్తులో భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో కోపోద్రిక్తులైన బావమరుదులు ఎలాగైనా అతనికి తగిన బుద్ధి చెబుదామని అబీదాకు చెప్పగా అందుకు అంగీకరించింది.
దీంతో సుబహాన్‌ను రెవెన్యూకాలనీలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సిమెంట్ రబ్బీస్ రాయితో తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అక్కడి నుంచి వెళ్లిపోయి అబీదాకు సమాచారం అందించారు. ఆమె భర్తను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెంచినట్లు ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రాజ్‌కుమార్, ఏఎస్‌ఐ ప్రసాద్, హెడ్‌కానిస్టేబుళ్లు జీ సుబ్బారావు, సురేష్, కానిస్టేబుల్స్ మస్తాన్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment