ఫెయిలైనందుకు ఆరుగురు, ఫెయిలవుతాననే భయంతో ఇంకొకరు
సాక్షి, నెట్‌వర్క్: ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో ఇంకొక విద్యార్థిని బలవన్మరణం పొందింది.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన హరిణి, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సా త్విక్, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థిని శ్రీజ ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు సేవించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, పరీక్ష ఫలితాల్లో ఆమె పాసైనట్లు వెల్లడైంది. ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment