సూర్యాపేట /మోతె: కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే.. మూఢనమ్మకంతో కసాయిలా మారింది. పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ప్రాణం తీసింది. విద్యావంతురాలైనా.. విచక్షణ కోల్పోయింది. కత్తితో గొంతు కోసి హతమార్చింది. నాగదేవతల రూపంలో ఉన్న చిత్రపటాల ఎదుట చిన్నారిని బలిచ్చింది. నా బిడ్డను చంపేశా.. నాకిక ఎలాంటి దోషం లేదంటూ కేకలు వేసింది. సూర్యాపేట జిల్లా మోతె మండలం బుర్కచర్ల గ్రామ ఆవాసం మేకలపాటి తండాలో గురువారం సాయంత్రం ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య మూఢ నమ్మకానికి తన బిడ్డ బలయ్యిందంటూ తండ్రి రోదించడం అందరి హృదయాలనూ కదలించింది.
వివాహమైనప్పటినుంచే: పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేకలపాటి తండాకు చెందిన బానోతు కృష్ణకు అదే తండాకు చెందిన భారతి అలియాస్ లాస్య, అలియాస్ బుజ్జితో మూడేళ్ల క్రితం వివాహమైంది. డిగ్రీ వరకు చదువుకున్న కృష్ణ వికలాంగుడు. వీరు తండాలోనే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా భారతి 6 నెలల క్రితమే ఆడబిడ్డ (రీతు)కు జన్మనిచ్చింది. అయితే కృష్ణ, భారతిల వివాహమైన ఏడెనిమిది నెలల తర్వాత క్షుద్ర పూజలు చేస్తూ జోస్యం చెప్పేవాడు తండాకు వచ్చాడు. భారతి.. తనకు భయం భయంగా ఉంటోందని, ఈ భయం పోవాలంటే ఏం చేయాలని అతన్ని అడిగింది.
నీకు సర్పదోషముందని, ఆ దోషం తొలగాలంటే నాగపూజలు చేయాలని, అంతేకాకుండా నీకు జన్మించే మగ, ఆడబిడ్డ ఎవరైనా సరే వారిని బలివ్వాలని అతను చెప్పినట్లు సమాచారం. అప్పటినుంచి వారంలో రెండు మూడు రోజులు భారతి నాగపూజలు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే భారతికి ఆరు నెలల క్రితం ఆడ బిడ్డ రీతు పుట్టింది. తర్వాత చిన్నారిని బలిచ్చేందుకు భారతి రెండుమూడు సార్లు ప్రయత్నించిందని బంధువులు చెబుతున్నారు.
భర్త లేకుండా చూసి..
భార్య ప్రవర్తనను కృష్ణ కూడా పసిగట్టాడు. గురువారం మధ్యాహ్నం సూర్యాపేటకు పనిపై వెళుతూ అత్తమామల వద్దకు వెళ్లాడు. భారతికి మతిస్థితిమితం సరిగా లేదని, రీతును ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి వెళ్ళాడు. అయితే వారు పట్టించుకోలేదు. ఇదే అదనుగా భారతి తాను అనుకున్న పని చేసేసింది.
నాకిక ఏ దోషం అడ్డురాదు
‘నా బిడ్డ రీతును చంపేశా. ఇక నాకు నాగసర్ప దోషమే కాదు.. ఏ దోషం కూడా అడ్డురాదు..’ అంటూ భారతి.. చిన్నారి గొంతు కోసిన కత్తి చేతపట్టుకుని తండాలోని తల్లి గారింటికి కేకలు వేసుకుంటూ వెళ్లింది.తనకు పుట్టిన పాపతోనే తన ప్రాణానికి ముప్పు ఉందని, ఈ రోజు నుంచి నా ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదంటూ తల్లిదండ్రుల ఎదుట రోదించింది. వెంటనే తల్లిదండ్రులకు భారతి నివాసానికి చేరుకొని చూడగా.. రీతు తెల్లని గుడ్డలో రక్తపు మడుగులో కన్పించింది. సూర్యాపేటలో పనిముగించుకుని వచ్చిన కృష్ణ – రక్తపుమడుగులో ఉన్న బిడ్డను చూసి కుప్పకూలిపోయాడు. అత్తమామలకు విషయం చెప్పినా పట్టించుకోలేదంటూ రోదించాడు. చిత్రపటాల ముందు పసుపు, కుంకుమలు, కొబ్బరి చిప్పలు ఉండటంతో ఈ దారుణానికి ముందు భారతి పూజలు నిర్వహించిందని భావిస్తున్నారు.
భారతి ఎప్పుడూ మొబైల్‌లో యూట్యూబ్ చూస్తూ కాలక్షేపం చేస్తుండేదని, ఎక్కువగా నాగపూజలకు సంబంధించిన వీడియోలు చూసేదని తెలుస్తోంది. వీడియోలు చూస్తూ నాగపూజలు చేయడం ప్రారంభించిందని చెబుతున్నారు. చిన్నారి హత్యతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. డిగ్రీతో పాటు బీఈడీ చేసిన భారతి పోటీ పరీక్షలకు సైతం సిద్ధమైంది. విద్యావంతురాలైనప్పటికీ మూఢ నమ్మకంతో కన్న బిడ్డ ప్రాణాలు తీయడం అందరినీ ఆశ్యర్యానికి గురిచేసింది. మోతె పోలీసులు భారతిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: బెడిసికొట్టిన విషప్రయోగం, తల్లి గొంతు నులిమిన కొడుకు
తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది
Published Fri, Apr 16 2021 2:09 AM | Last Updated on Fri, Apr 16 2021 12:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment