డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్‌్కల అపహరణ
పాఠశాల భవనానికి, గేట్లకు తాళాలు
భవనంపైన, ప్రహరీపైన టీడీపీ జెండాలు
ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యాసంస్థల వ్యవస్థాపకుడు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రగతి సీబీఎస్‌ఈ పాఠశాలపై శనివారం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాలపై దాడి చేసి పాఠశాలలో ఉన్న డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్ అపహరించుకెళ్లారు. పాఠశాల భవనానికి, గేట్లకు తాళాలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారు. దీనిపై ప్రగతి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ మక్కెన అచ్చయ్య మాట్లాడుతూ.. తాను, తన సతీమణి మక్కెన పద్మజ 2013లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ గుంటూరు (ఏఈఎల్‌సీ) వారి నుంచి విద్యాసంస్థలు నిర్వహించడానికి 2.20 ఎకరాల స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నట్లు తెలిపారు.
పాఠశాల భవన నిర్మాణ సమయంలో మొక్కపాటి చంద్రశేఖర్, వెలినేడి కోటేశ్వరరావు, సూర్యదేవర శ్రీనివాసరావు తనను కలిసి విద్యాబోధన అంటే ఇష్టమని నమ్మబలికి 2015లో ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీలో సభ్యులుగా చేరారని, ఆరునెలలు గడవక ముందే తనతో గొడవపడ్డారని చెప్పారు. పాఠశాలకు చిన్న భవనం సరిపోతుందని, రెండెకరాల ఖాళీస్థలంలో వాణిజ్య సముదాయం ని ర్మించాలని ప్రతిపాదిస్తే తాను తిరస్కరించానని, ఆ స్థలం విద్యాసంస్థల నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలని చెప్పానని పేర్కొన్నారు.
అందుకోసమే ఆ స్థలాన్ని లీజుకి ఇచ్చారని చెప్పడంతో ఘర్షణ మొదలైందన్నారు. విద్యా సంవత్సరం మొదలయ్యే సమయంలో పాఠశాల మీద అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు దాడిచేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? రక్షణ కల్పించమని ఎవరిని అడగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యిమంది విద్యార్థులు సీబీఎస్‌ఈ విద్యా విధానానికి దూరమవుతారేమోనని ఆందోళనగా ఉందన్నారు.
ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం మూడుగంటలకు టీడీపీ నాయకుడు సూర్యదేవర శ్రీనివాసరావు తన అనుచరులతో పాఠశాల మీద దాడిచేసి కార్యాలయ తలుపులు పగలగొట్టి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వాచ్‌మన్‌ను చంపుతామని బెదిరించి పాఠశాల డాక్యుమెంట్స్‌ను తస్కరించడానికి ప్రయత్నించారని చెప్పారు. ఆయన, ఆయన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఆ ఫిర్యాదును నమోదు చేయలేదని, ఎటువంటి చర్య తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై సూర్యదేవర శ్రీనివాసరావు స్పందించారు. గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని మక్కెన అచ్చయ్య తన స్కూల్‌ను కబ్జా చేశాడని, తన స్కూల్‌ను తాను స్వాధీనం చేసుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడని ఒక ప్రకటలో పేర్కొన్నారు. దీనికి, టీడీపీకి సంబంధం లేదని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment