attack on school
-
ప్రగతి సీబీఎస్ఈ పాఠశాలపై టీడీపీ దౌర్జన్యం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రగతి సీబీఎస్ఈ పాఠశాలపై శనివారం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాఠశాలపై దాడి చేసి పాఠశాలలో ఉన్న డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్ అపహరించుకెళ్లారు. పాఠశాల భవనానికి, గేట్లకు తాళాలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారు. దీనిపై ప్రగతి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ మక్కెన అచ్చయ్య మాట్లాడుతూ.. తాను, తన సతీమణి మక్కెన పద్మజ 2013లో ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్ గుంటూరు (ఏఈఎల్సీ) వారి నుంచి విద్యాసంస్థలు నిర్వహించడానికి 2.20 ఎకరాల స్థలాన్ని దీర్ఘకాలిక లీజుకు తీసుకున్నట్లు తెలిపారు. పాఠశాల భవన నిర్మాణ సమయంలో మొక్కపాటి చంద్రశేఖర్, వెలినేడి కోటేశ్వరరావు, సూర్యదేవర శ్రీనివాసరావు తనను కలిసి విద్యాబోధన అంటే ఇష్టమని నమ్మబలికి 2015లో ప్రగతి ఎడ్యుకేషనల్ సొసైటీలో సభ్యులుగా చేరారని, ఆరునెలలు గడవక ముందే తనతో గొడవపడ్డారని చెప్పారు. పాఠశాలకు చిన్న భవనం సరిపోతుందని, రెండెకరాల ఖాళీస్థలంలో వాణిజ్య సముదాయం ని ర్మించాలని ప్రతిపాదిస్తే తాను తిరస్కరించానని, ఆ స్థలం విద్యాసంస్థల నిర్వహణకు మాత్రమే ఉపయోగించాలని చెప్పానని పేర్కొన్నారు. అందుకోసమే ఆ స్థలాన్ని లీజుకి ఇచ్చారని చెప్పడంతో ఘర్షణ మొదలైందన్నారు. విద్యా సంవత్సరం మొదలయ్యే సమయంలో పాఠశాల మీద అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ నాయకులు దాడిచేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి? రక్షణ కల్పించమని ఎవరిని అడగాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యిమంది విద్యార్థులు సీబీఎస్ఈ విద్యా విధానానికి దూరమవుతారేమోనని ఆందోళనగా ఉందన్నారు. ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం మూడుగంటలకు టీడీపీ నాయకుడు సూర్యదేవర శ్రీనివాసరావు తన అనుచరులతో పాఠశాల మీద దాడిచేసి కార్యాలయ తలుపులు పగలగొట్టి, సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వాచ్‌మన్‌ను చంపుతామని బెదిరించి పాఠశాల డాక్యుమెంట్స్‌ను తస్కరించడానికి ప్రయత్నించారని చెప్పారు. ఆయన, ఆయన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఆ ఫిర్యాదును నమోదు చేయలేదని, ఎటువంటి చర్య తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సూర్యదేవర శ్రీనివాసరావు స్పందించారు. గత ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని మక్కెన అచ్చయ్య తన స్కూల్‌ను కబ్జా చేశాడని, తన స్కూల్‌ను తాను స్వాధీనం చేసుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నాడని ఒక ప్రకటలో పేర్కొన్నారు. దీనికి, టీడీపీకి సంబంధం లేదని ఆయన తెలిపారు. -
Israel-Hamas war: శరణార్థుల శిబిరంపై దాడి.. 33 మంది మృతి
డెయిర్ అల్ బలాహ్(గాజా): ఇజ్రాయెల్ బలగాలు సెంట్రల్ గాజాలో వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. నుసెయిరత్‌లోని అల్–సర్డి స్కూల్‌పై గురువారం వేకువజామున జరిపిన దాడుల్లో 14 మంది చిన్నారులు, 9 మంది మహిళలు సహా మొత్తం 33 మంది చనిపోయారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అల్–సర్డి స్కూల్లో శరణార్థి శిబిరం నడుస్తోంది. ఉత్తర గాజాలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించిన తర్వాత అక్కడి నుంచి ప్రాణాలరచేతిలో పట్టుకుని వచ్చిన వారంతా ఈ శిబిరంలో తలదాచుకుంటున్నారు. అయితే, హమాస్ మిలిటెంట్లు ఈ స్కూల్ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. కాగా, గురువారం ఇజ్రాయెల్ ఆర్మీ నుసెయి రత్‌లోనే మరో నివాస భవనంపై జరిపిన దాడిలో మరో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అల్–అక్సా మార్టిర్స్ ఆస్పత్రి క్షతగా త్రులతో కిటకిటలాడుతోందని స్థానికులు తెలిపారు. విద్యుత్ సరఫరా కూడా ఆస్పత్రి లోని కొన్ని ముఖ్యమైన వార్డుల్లోనే ఉందని చెప్పారు. మృతదేహాలతో కూడిన ప్లాస్టిక్ బ్యాగులు ఆవరణలో వరుసగా పడేసి ఉన్నాయని, బాధితుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోందన్నారు. -
‘ఉగ్ర’ సర్పం
పాకిస్తాన్ మళ్లీ నెత్తురోడింది. ఏడాది క్రితం 140మంది పిల్లల ఉసురు తీసిన పెషావర్ పాఠశాల ఉదంతాన్ని తలపిస్తూ బుధవారం వాయువ్య పాకిస్తాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీపై తాలిబాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఒక ప్రొఫెసర్‌తో సహా 21మందిని పొట్టనబెట్టుకున్నారు. అప్రమత్తంగా ఉన్న ప్రొఫెసర్ ఒకరు తన ప్రాణాలను పణంపెట్టి ఉగ్రవాదులపై తుపాకితో విరుచుకుపడకపోతే మరింత మందిని ఉగ్రవాదులు బలితీసుకునేవారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించడానికి ఉద్దేశించిన 20 అంశాల జాతీయ కార్యాచరణ ప్రణాళికను చాలా పటిష్టంగా అమలు చేశామని నెల్లాళ్లక్రితం పాకిస్తాన్ సైన్యం ఘనంగా చెప్పుకుంది. ఆ ప్రకటనకు జవాబు అన్నట్టుగా ఉగ్రవాదులు గత 20 రోజులుగా మరింత రెచ్చిపో తున్నారు. వివిధ ఘటనల్లో ఇంతవరకూ 60 మంది ప్రాణాలు తీశారు. జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద సైన్యమూ, పోలీసులు సమష్టిగా దాడులు నిర్వహించి దేశవ్యాప్తంగా వేలాదిమందిని నిర్బంధించారు. అనేకమంది మిలిటెంట్లను మట్టు బెట్టారు. ఇందులో కోవర్టు ఆపరేషన్లు కూడా ఉన్నాయి. అయినా ఉగ్రవాదం కాస్తయినా నియంత్రణలోకి రాలేదు. అహింసను బోధించిన ‘సరిహద్దు గాంధీ’ ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ పేరిట నెలకొల్పిన బచాఖాన్ యూనివర్సిటీ రక్తసిక్త మైంది. తుపాకులు, గ్రెనేడ్ల మోతతో దద్దరిల్లింది. వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తూన్ఖ్వా అఫ్ఘానిస్తాన్ సరిహద్దు రాష్ట్రం కావడంవల్ల ఆదినుంచీ అది సమస్యాత్మకంగానే ఉంది. ముఖ్యంగా గత పదిహేనేళ్లనుంచి ఆ వైపునుంచి ఉగ్రవాద బెడద ఎక్కువే. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్‌నుంచి మన దేశంలోకి ఉగ్రవాదులు చొరబడినట్టు అఫ్ఘాన్ గిరిజన ప్రాంతాలను ఆవాసం చేసుకుని ఖైబర్ ఫక్తూన్ఖ్వాలో దాడులకు పాల్పడటం తెహ్రీక్-ఏ-తాలిబాన్(టీటీపీ) ఉగ్రవాదులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా 2014లో అఫ్ఘాన్‌లో తన సైనిక కార్యకలాపాలను అమెరికా పరిమితం చేసుకున్నాక ఇది ఎన్నో రెట్లు పెరిగింది. ఆ సరిహద్దుల్లో లక్షన్నరమంది సైనికుల్ని పహారా ఉంచినా పరిస్థితి దారికి రావడంలేదు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ పాటి స్తున్న ద్వంద్వ ప్రమాణాలే ప్రస్తుత స్థితికి ముఖ్య కారణం. ఒకపక్క అఫ్ఘాన్‌నుంచి తమకు ఉగ్రవాద బెడద పెరిగిందంటూనే... అఫ్ఘాన్ పాలకుల్ని దారికి తెచ్చు కోవడం కోసం అక్కడ మిలిటెంట్లను పెంచి పోషిస్తున్నది పాకిస్తానే. అఫ్ఘాన్‌లో తరచు మారణహోమాన్ని సృష్టిస్తున్న తాలిబాన్లకు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉందన్నది బహిరంగ రహస్యం. ఈమధ్య కాలంలో భారత దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడుల్లో పాక్ హస్తం ఉందని అఫ్ఘాన్ మంత్రే ఆరోపించారు. తన సహకారం లేనిదే ఒక దేశంగా మనుగడ సాగించడం అఫ్ఘాన్‌కు సాధ్యం కాదని చెప్పడమే పాక్ ఉద్దేశం. కానీ ఈ క్రమంలో ఉగ్రవాదం తనను కూడా దహించి వేస్తున్నదని పాక్ గుర్తించేసరికి ఆలస్యమైపోయింది. జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉండగా ఉగ్రవాదుల్లో మంచి వాళ్లూ, చెడ్డవాళ్లూ ఉంటారని వర్గీకరించారు. ‘మంచి ఉగ్రవాదుల’కు సాయం చేయాలన్నది కేవలం ముషార్రఫ్ ఆలోచన మాత్రమే కాదు. దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యం అనుసరిస్తున్న ధోరణి. దానికి అనుగుణంగానే కశ్మీర్‌ను అడ్డంపెట్టుకుని ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశానికి ఎన్నో సమస్యలను సృష్టిస్తోంది. కొందరికే అండదండలిచ్చే ఈ విధానం ఇతర ఉగ్రవాద గ్రూపులకు ఊపిరిపోసింది. మూడేళ్లక్రితం పాక్ సైన్యం వెలువరించిన ‘గ్రీన్ బుక్’ పాకిస్తాన్‌కు వెలుపలి నుంచి కాక లోపలినుంచే పెనుముప్పు పొంచి ఉన్నదని, ఉగ్రవాదమే తమకు ప్రధాన శత్రువని ప్రకటించింది. అయితే దానికి అనుగుణమైన తదుపరి చర్యలు కొరవడ టంవల్ల ఆచరణలో అది నిరుపయోగంగా మారింది. మొన్నటికి మొన్న మన పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై జరిగిన దాడికి కారకుడిగా భావిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ హఫీజ్ సయీద్‌ను అరెస్టు చేశారో లేదో ఇంతవరకూ పాక్ చెప్ప లేకపోయింది. మరోపక్క హిజ్బుల్ మొజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలా హుద్దీన్ ఆ దాడి తమ ఘనతేనని ఒక ఇంటర్వ్యూలో ప్రకటించాడు. అతనిపైనా చర్యలు లేవు. పెషావర్‌లో హై సెక్యూరిటీ జోన్‌లోని పాఠశాలపై టీటీపీ ఉగ్రవాదులు దాడి జరిపాక అయినా ఉగ్రవాదుల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను పాక్ విడనాడి ఉంటే వేరుగా ఉండేది. అందుకు బదులుగా టీటీపీని నామరూపాల్లేకుండా చేస్తామని ప్రతినబూని ఆ సంస్థ మిలిటెంట్లను నిర్దాక్షిణ్యంగా ఏరేయడం మొదలుపెట్టారు. రాజ్యాంగాన్ని సవరించి సైనిక కోర్టుల్లో రహస్యంగా విచారణలు నిర్వహించి ఉగ్రవాదులకు ఉరిశిక్షలు వేసే వీలుకల్పించారు. పౌర న్యాయస్థానాలు ఉగ్రవాద బెడదతో సరిగా తీర్పులను ఇవ్వలేకపోతున్నాయన్న సాకుతో దీన్ని అమల్లోకి తెచ్చారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే పేరిట రాజ్యం తానే ఉగ్రవాదిగా మారకూడదని...ఆ బెడద విషయంలో ఇన్నాళ్ల తన ఆచరణనూ, ద్వంద్వ ప్రమాణాలనూ సమీక్షించుకుని సవరించుకుంటే సరిపోతుందని ఎందరో ప్రజాస్వామికవాదులు చెప్పారు. అయినా ఫలితం లేకపోయింది. గత ఏడాది కాలంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద అమలు చేస్తున్న కోవర్టు ఆపరేషన్లు, అరెస్టులు...సైనిక కోర్టుల్లో విచక్షణారహితంగా అమలు చేస్తున్న మరణశిక్షలు ఉగ్రవాదులను మరింత ఉన్మాదుల్ని చేశాయి. సామాన్య పౌరుల్లో వారికి సానుభూతిని పెంచాయి. ఉరికంబం ఎక్కుతున్నవారిలో నిజమైన ఉగ్రవాదులెందరనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. తాజా ఉదంతంతోనైనా కళ్లు తెరిచి ఉగ్రవాదం విషయంలో సమగ్రమైన, హేతుబద్ధమైన దృక్పథాన్ని అలవర్చుకోనట్టయితే...ఆ విషయంలో పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను విడనాడకపోతే స్వీయ నాశనం తప్పదని పాక్ గ్రహించాలి.