‘ఉగ్ర’ సర్పం
పాకిస్తాన్ మళ్లీ నెత్తురోడింది. ఏడాది క్రితం 140మంది పిల్లల ఉసురు తీసిన పెషావర్ పాఠశాల ఉదంతాన్ని తలపిస్తూ బుధవారం వాయువ్య పాకిస్తాన్‌లోని బచాఖాన్ యూనివర్సిటీపై తాలిబాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఒక ప్రొఫెసర్‌తో సహా 21మందిని పొట్టనబెట్టుకున్నారు. అప్రమత్తంగా ఉన్న ప్రొఫెసర్ ఒకరు తన ప్రాణాలను పణంపెట్టి ఉగ్రవాదులపై తుపాకితో విరుచుకుపడకపోతే మరింత మందిని ఉగ్రవాదులు బలితీసుకునేవారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించడానికి ఉద్దేశించిన 20 అంశాల జాతీయ కార్యాచరణ ప్రణాళికను చాలా పటిష్టంగా అమలు చేశామని నెల్లాళ్లక్రితం పాకిస్తాన్ సైన్యం ఘనంగా చెప్పుకుంది. ఆ ప్రకటనకు జవాబు అన్నట్టుగా ఉగ్రవాదులు గత 20 రోజులుగా మరింత రెచ్చిపో తున్నారు. వివిధ ఘటనల్లో ఇంతవరకూ 60 మంది ప్రాణాలు తీశారు.
జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద సైన్యమూ, పోలీసులు సమష్టిగా దాడులు నిర్వహించి దేశవ్యాప్తంగా వేలాదిమందిని నిర్బంధించారు. అనేకమంది మిలిటెంట్లను మట్టు బెట్టారు. ఇందులో కోవర్టు ఆపరేషన్లు కూడా ఉన్నాయి. అయినా ఉగ్రవాదం కాస్తయినా నియంత్రణలోకి రాలేదు. అహింసను బోధించిన ‘సరిహద్దు గాంధీ’ ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ పేరిట నెలకొల్పిన బచాఖాన్ యూనివర్సిటీ రక్తసిక్త మైంది. తుపాకులు, గ్రెనేడ్ల మోతతో దద్దరిల్లింది.
వాయువ్య పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫక్తూన్‌ఖ్వా అఫ్ఘానిస్తాన్ సరిహద్దు రాష్ట్రం కావడంవల్ల ఆదినుంచీ అది సమస్యాత్మకంగానే ఉంది. ముఖ్యంగా గత పదిహేనేళ్లనుంచి ఆ వైపునుంచి ఉగ్రవాద బెడద ఎక్కువే. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్‌నుంచి మన దేశంలోకి ఉగ్రవాదులు చొరబడినట్టు అఫ్ఘాన్ గిరిజన ప్రాంతాలను ఆవాసం చేసుకుని ఖైబర్ ఫక్తూన్‌ఖ్వాలో దాడులకు పాల్పడటం తెహ్రీక్-ఏ-తాలిబాన్(టీటీపీ) ఉగ్రవాదులకు అలవాటుగా మారింది. ముఖ్యంగా 2014లో అఫ్ఘాన్‌లో తన సైనిక కార్యకలాపాలను అమెరికా పరిమితం చేసుకున్నాక ఇది ఎన్నో రెట్లు పెరిగింది. ఆ సరిహద్దుల్లో లక్షన్నరమంది సైనికుల్ని పహారా ఉంచినా పరిస్థితి దారికి రావడంలేదు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ పాటి స్తున్న ద్వంద్వ ప్రమాణాలే ప్రస్తుత స్థితికి ముఖ్య కారణం.
ఒకపక్క అఫ్ఘాన్‌నుంచి తమకు ఉగ్రవాద బెడద పెరిగిందంటూనే... అఫ్ఘాన్ పాలకుల్ని దారికి తెచ్చు కోవడం కోసం అక్కడ మిలిటెంట్లను పెంచి పోషిస్తున్నది పాకిస్తానే. అఫ్ఘాన్‌లో తరచు మారణహోమాన్ని సృష్టిస్తున్న తాలిబాన్‌లకు పాకిస్తాన్ సైన్యం మద్దతు ఉందన్నది బహిరంగ రహస్యం. ఈమధ్య కాలంలో భారత దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడుల్లో పాక్ హస్తం ఉందని అఫ్ఘాన్ మంత్రే ఆరోపించారు. తన సహకారం లేనిదే ఒక దేశంగా మనుగడ సాగించడం అఫ్ఘాన్‌కు సాధ్యం కాదని చెప్పడమే పాక్ ఉద్దేశం. కానీ ఈ క్రమంలో ఉగ్రవాదం తనను కూడా దహించి వేస్తున్నదని పాక్ గుర్తించేసరికి ఆలస్యమైపోయింది.
జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉండగా ఉగ్రవాదుల్లో మంచి వాళ్లూ, చెడ్డవాళ్లూ ఉంటారని వర్గీకరించారు. ‘మంచి ఉగ్రవాదుల’కు సాయం చేయాలన్నది కేవలం ముషార్రఫ్ ఆలోచన మాత్రమే కాదు. దశాబ్దాలుగా పాకిస్తాన్ సైన్యం అనుసరిస్తున్న ధోరణి. దానికి అనుగుణంగానే కశ్మీర్‌ను అడ్డంపెట్టుకుని ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ మన దేశానికి ఎన్నో సమస్యలను సృష్టిస్తోంది. కొందరికే అండదండలిచ్చే ఈ విధానం ఇతర ఉగ్రవాద గ్రూపులకు ఊపిరిపోసింది. మూడేళ్లక్రితం పాక్ సైన్యం వెలువరించిన ‘గ్రీన్ బుక్’ పాకిస్తాన్‌కు వెలుపలి నుంచి కాక లోపలినుంచే పెనుముప్పు పొంచి ఉన్నదని, ఉగ్రవాదమే తమకు ప్రధాన శత్రువని ప్రకటించింది. అయితే దానికి అనుగుణమైన తదుపరి చర్యలు కొరవడ టంవల్ల ఆచరణలో అది నిరుపయోగంగా మారింది. మొన్నటికి మొన్న మన పఠాన్‌కోట్ వైమానిక దళ స్థావరంపై జరిగిన దాడికి కారకుడిగా భావిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ హఫీజ్ సయీద్‌ను అరెస్టు చేశారో లేదో ఇంతవరకూ పాక్ చెప్ప లేకపోయింది. మరోపక్క హిజ్బుల్ మొజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలా హుద్దీన్ ఆ దాడి తమ ఘనతేనని ఒక ఇంటర్వ్యూలో ప్రకటించాడు. అతనిపైనా చర్యలు లేవు.
పెషావర్‌లో హై సెక్యూరిటీ జోన్‌లోని పాఠశాలపై టీటీపీ ఉగ్రవాదులు దాడి జరిపాక అయినా ఉగ్రవాదుల విషయంలో అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను పాక్ విడనాడి ఉంటే వేరుగా ఉండేది. అందుకు బదులుగా టీటీపీని నామరూపాల్లేకుండా చేస్తామని ప్రతినబూని ఆ సంస్థ మిలిటెంట్లను నిర్దాక్షిణ్యంగా ఏరేయడం మొదలుపెట్టారు. రాజ్యాంగాన్ని సవరించి సైనిక కోర్టుల్లో రహస్యంగా విచారణలు నిర్వహించి ఉగ్రవాదులకు ఉరిశిక్షలు వేసే వీలుకల్పించారు. పౌర న్యాయస్థానాలు ఉగ్రవాద బెడదతో సరిగా తీర్పులను ఇవ్వలేకపోతున్నాయన్న సాకుతో దీన్ని అమల్లోకి తెచ్చారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే పేరిట రాజ్యం తానే ఉగ్రవాదిగా మారకూడదని...ఆ బెడద విషయంలో ఇన్నాళ్ల తన ఆచరణనూ, ద్వంద్వ ప్రమాణాలనూ సమీక్షించుకుని సవరించుకుంటే సరిపోతుందని ఎందరో ప్రజాస్వామికవాదులు చెప్పారు. అయినా ఫలితం లేకపోయింది.
గత ఏడాది కాలంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద అమలు చేస్తున్న కోవర్టు ఆపరేషన్లు, అరెస్టులు...సైనిక కోర్టుల్లో విచక్షణారహితంగా అమలు చేస్తున్న మరణశిక్షలు ఉగ్రవాదులను మరింత ఉన్మాదుల్ని చేశాయి. సామాన్య పౌరుల్లో వారికి సానుభూతిని పెంచాయి. ఉరికంబం ఎక్కుతున్నవారిలో నిజమైన ఉగ్రవాదులెందరనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. తాజా ఉదంతంతోనైనా కళ్లు తెరిచి ఉగ్రవాదం విషయంలో సమగ్రమైన, హేతుబద్ధమైన దృక్పథాన్ని అలవర్చుకోనట్టయితే...ఆ విషయంలో పాటిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను విడనాడకపోతే స్వీయ నాశనం తప్పదని పాక్ గ్రహించాలి.