మామిడి తోటలో గుట్టుగా పెంపకం..
అజ్ఞాత వ్యక్తి సమాచారంతో రంగంలోకి సెబ్
రూ.21 వేల విలువైన గంజాయి మొక్కల స్వాదీనం
సాక్షి టాస్క్‌ఫోర్స్: గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు నిత్యం ప్రచార పటాటోపం చేస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతలే గంజాయి పండిస్తున్నారు. ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన టీడీపీ నేత స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్)కి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం మండలం టి.వీరాపురంలో టీడీపీ నాయకుడు చిలకరి వన్నూరుస్వామి మామిడి తోటలో గంజాయి మొక్కలు పెంచుతూ పట్టుబడ్డాడు. వన్నూరుస్వామి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ముఖ్య అనుచరుడు.
టి.వీరాపురం గ్రామ సమీపాన కణేకల్లు క్రాస్‌కు చెందిన రవి అనే రైతు 9.5 ఎకరాల భూమిలో మామిడి, అల్ల నేరేడు పెంపకం చేపట్టాడు. ఈ తోట కాపరిగా టీడీపీ నాయకుడు వన్నూరుస్వామి కొంతకాలంగా ఉంటున్నాడు. పండ్ల తోటల మధ్య బంతి, కనకాంబరాల సాగు మొదలుపెట్టాడు. అందులోనే గుట్టుగా గంజాయి మొక్కల పెంపకం చేపట్టాడు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించి.. జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకటలక్ష్మమ్మకు సమాచారాన్ని చేరవేశాడు.
ఆమె సెబ్ పోలీసులకు తెలపడంతో రంగంలోకి దిగారు. 7.25 కిలోల బరువు ఉన్న నాలుగు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని.. నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. శుక్రవారమే గంజాయి పట్టుబడగా 24 గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిచ్చింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.21 వేలు ఉంటుందని సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. నిందితుడికి గంజాయి తీసుకునే అలవాటు ఉందని, ఈ కారణంగానే నాలుగు మొక్కలు పెంచుకున్నాడనే విషయం తమ దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment