హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ
కళాశాల ఎదుట బంధువుల ఆందోళన
మృతదేహం వద్ద సూసైడ్ నోట్ లభ్యం
హనుమకొండలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఘటన
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పరిధి భీమారంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి చెందిన హాస్టల్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే తమ కూతురును హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్ల కనపర్తికి చెందిన వలుగుల ప్రభాకర్, కవిత దంపతుల పెద్దకూతురు సాహిత్య (17) భీమారంలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమె అదే కళాశాల హాస్టల్‌లోనే ఉంటోంది. ఇటీవల ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో గత సబ్జెక్టుల్లో సాహిత్య అనుకున్నంత మేరకు పరీక్షలు రాయలేదు. దీంతో సాహిత్య మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోంది.
భవనంపై నుంచి దూకి..?
సాహిత్య, కళాశాల హాస్టల్ భవనం పైనుంచి శుక్రవారం తెల్లవారు జామున దూకి ఉండవచ్చని పోలీ సులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సాహిత్య కింద పడి ఉండటం గమనించిన కళాశాల యాజమాన్యం హుటాహుటిన ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించింది. అక్కడినుంచి ఎంజీఎంకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.
సూసైడ్ నోట్ లభ్యం..
ఇదిలా ఉండగా సాహిత్య రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘జువాలజీ పరీక్ష రోజు చనిపోతున్నా’అని అందులో పేర్కొంది. అయితే పోలీసులు స్వా«దీనం చేసుకున్న ఆ సూసైడ్ నోట్ తన కూతురిది కాదని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కూతురును హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి పెట్టారని తెలిపారు. భవనంపై నుంచి దూకితే చేతిపై బ్లేడ్‌తో కోసిన గాయాలు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. తమ కూతురు మృతదేహాన్ని గోప్యంగా ఎందుకు ఎంజీఎంకు తరలించారన్నారు.
కళాశాల ఎదుట ఆందోళన
తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఆందోళన కొనసాగింది. వారి ఆందోళనకు వి ద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి, స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజీవ, ఎస్సైలు రాజ్‌కుమార్, సురేశ్‌లు ఆందోళనకారులను శాంతింపజేశారు. సాహిత్య మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సంజీవ తెలిపారు. కళాశాలలో ఉన్న సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే సూసైడ్ నోట్‌ను ఫోరెనిక్స్ పరీక్షలకు పంపించనున్నట్లు చెప్పారు.
నేత్ర దానం
సాహిత్య నేత్రాలు దానం చేశారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రాంతీయ నేత్ర వైద్యశాల, వరంగల్ సిబ్బంది నేత్రాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment