నుజ్జునుజ్జయిన ఆటో, ప్రమాదానికి కారణమైన కారు
మహబూబ్‌నగర్ క్రైం: వారంతా ఒకే ఆఫీసులో ఉద్యోగులు.. విధులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు.. స్టేజీవద్ద ఆటో ఎక్కారు.. కాసేపటికే ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతున్న యువకులు ఆ ఆటోను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌తోపాటు ఇద్దరు ఉద్యోగులు మృతిచెందారు.
మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఓబులాయపల్లి సమీపంలో ఈ విషాదం జరిగింది. హైదరాబాద్‌లో మందుబాబులు నిషాలో నలుగురిని బలిగొన్న విషయం మరవకముందే మరో సంఘటన జరిగింది.
విధులు ముగించుకుని వెళ్తూ..
మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం గోటూర్‌కు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉంటూ ఆటో నడుపుతుంటాడు. ఈ క్రమంలోనే గురువారం స్వగ్రామానికి వెళ్లి తిరిగి మహబూబ్‌నగర్‌కు బయల్దేరాడు.
అదేసమయంలో దేవరకద్ర ఎం పీడీవో కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ జ్యోతి, అటెండర్ విజయరాణి, టైపిస్ట్ శ్రీలత, అటెండర్ ఖాజామొయినుద్దీన్, మణికొండకు చెందిన కవిత విధులు ముగించుకుని బస్టాండ్ వద్దకు వచ్చారు. మహబూబ్‌నగర్ వెళ్లేందుకు ఇదే ఆటో ఎక్కారు.
♦మరోవైపు నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్‌కు చెందిన యువకులు రవిబాబు, కరుణాకర్, దయాకర్, నందకుమార్, మరో ఇద్దరు కలిసి మహబూబ్‌నగర్‌లో ఓ పెళ్లికి వెళ్లి స్విఫ్ట్ కారులో తిరిగి వస్తున్నారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు.. వేగంగా ప్రయాణిస్తూ ఓబులాయపల్లి సమీపంలో చంద్రశేఖర్‌రెడ్డి ఆటోను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో చంద్రశేఖర్‌రెడ్డి (45), విజయరాణి (38) అక్కడిక్కడే మృతి చెందగా.. జ్యోతి (48) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. శ్రీలత, ఖాజా, కవితకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో యువకులకు స్పల్పంగా గాయాలయ్యాయి.
పోలీసుపై చెయ్యి చేసుకుని..
కారులోని యువకులు ప్రమాదానికి కారణమవడమేగాక మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. సివిల్ డ్రస్‌లో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ఓ పోలీసుపై చెయ్యి చేసుకున్నారు. అదిచూసి స్థానికులు, ఇతర వాహనదారులు కలిసి ఆ యువకులను చితకబాదారు. అప్పటికే పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని.. నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
భర్త మరణంతో ఉద్యోగంలో చేరి..
అటెండర్ విజయరాణి, జూనియర్ అసిస్టెంట్ జ్యోతి ఇద్దరూ భర్త మరణించడంతో.. ఆ ఉద్యోగాల్లో చేరినవారే. జ్యోతికి ఇద్దరూ ఆడపిల్లలే. ఆస్పత్రివద్ద తల్లి మృతదేహాన్ని చూసి వారు చేసిన రోదనలు అం దరినీ కంటతడి పెట్టించాయి. ఇక విజయరాణి ఈ నెల 4వ తేదీనే దేవరకద్రలో అటెండర్‌గా విధుల్లో చేరింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. బాధితులను ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. ప్రభు త్వం తరఫున సాయంఅందిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment