
ఓడీ చెరువు మండలం దాదిరెడ్డిపల్లికి చెందిన రైతు హనుమంతరెడ్డి రెండు రోజుల క్రితం తన కాడెద్దులు, రెండు పాడి ఆవులను ఇంటి పక్కనే ఉన్న పశువుల పాకలో కట్టేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు యువకులు పాకలో చొరబడి ఆవులను, కుర్రలను తోలుకెళ్లారు. సీసీ ఫుటేజీల్లో చోరీ ఘటన స్పష్టంగా రికారై్డంది. దీనిపై బాధిత రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అపహరణకు గురైన పశువుల విలువ దాదాపు రూ.2 లక్షలు ఉంటుంది.
పెనుకొండ పట్టణం గోనిపేట ప్రాంతంలో నివసించే గొల్ల నాగేంద్ర, బోయ వెంకటేష్ నాలుగు పాడి ఆవులను మేపుకుంటూ, వచ్చే పాలను అమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. జూలై 21 రాత్రి వీరి పశువుల పాకలోకి చొరబడిన దుండగులు పాడి ఆవులను ఎత్తుకెళ్లిపోయారు. కత్తులతో తాళ్లను తెగ్గోసి పశువులను అపహరించుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికీ దొంగలను పట్టుకోలేకపోయారు.
పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లాలో పశువుల దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. లక్షల రూపాయల విలువ చేసే పాడి ఆవులను ఎత్తుకెళ్లిపోతున్నారు. ఒక్క పెనుకొండ నియోజకవర్గంలోనే గడచిన 40 రోజుల్లో 20కి పైగా పశువులు అపహరణకు గురయ్యాయి. గోరంట్ల మండలం మల్లాపల్లిలో రూ. లక్ష విలువజేసే ఎద్దులు, పెనుకొండ మండలం తిమ్మాపురంలో రమేష్ అనే వ్యక్తికి చెందిన 4 పాడి ఆవులు, సమీపంలోనే రాంపురం వద్ద షిర్డీసాయి గ్లోబల్ ట్రస్ట్‌కు చెందిన 3 పాడి ఆవులు, సోమందేపల్లిలో శనివారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే నివాసముంటున్న పాడి రైతు వెంకటేశులుకు చెందిన 3 పాడి ఆవులు, నలగొండ్రాయనిపల్లిలో కంబాలరాయు డికి చెందిన 3 ఆవులను దుండుగులు ఎత్తుకెళ్లారు.
చోద్యం చూస్తున్న పోలీసులు
వరుస చోరీలతో పశువుల దొంగలు బెంబేలెత్తిస్తున్నా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. చోరీ జరిగిన రెండు మూడు రోజులు సీసీ కెమెరాలు పరిశీలించడం, గస్తీ పెంచామంటూ హంగామా చేసి తర్వాత మిన్నకుండిపోతున్నారు. బాధితులు మాత్రం నిత్యం కాళ్లరిగేలా పోలీసుస్టేషన్ల చుట్టూ తిరిగి చివరకు లాభం లేదని తెలుసుకుని లోలోనే కుమిలిపోతున్నారు.
పాడి రైతుకు పెద్ద దెబ్బ
రైతన్నలు వ్యవసాయంతో పాటు పాడి పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం కూడా సహకరిస్తుండడంతో బయటి నుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకొచ్చి పశువులు కొనుగోలు చేస్తున్నారు. పాల ఆదాయంతో కుటుంబం మొత్తాన్ని పోషించుకుంటున్నారు. ఎన్నో ఆశలతో రూ.లక్షలు పెట్టి తీసుకొచ్చిన జీవాలను దొంగలు పట్టుకెళ్లిపోతుండడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. దుండగులు రెచ్చిపోతుండడంతో జిల్లాలో పశువుల పెంపకందారులకు కంటిమీద కునుకులేని పరిస్థితి.
సీసీ కెమెరాలున్నా ఫలితం శూన్యం
అసాంఘిక కార్యకలాపాల కట్టడికంటూ పోలీసులు అక్కడక్కడా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. రూ. వేలతో ఏర్పాటు చేసిన కెమెరాలు కొన్నిచోట్ల నేలచూపులు చూస్తున్నాయి. మరికొన్నిచోట్ల పర్యవేక్షణ లేని దుస్థితి. దీంతో దుండగులు సులువుగా తమ పని చేసుకుపోతున్నారు. చేతుల్లో కత్తులు పెట్టుకుని యథేచ్ఛగా సంచరిస్తున్నారు. ఏకంగా గ్రామాల సమీపాల్లోకి వాహనాలు తీసుకొచ్చి చోరీ చేసిన పశువులను ఎత్తుకెళ్లిపోతున్నారు. నలగొండ్రాయనిపల్లిలో కళ్లెదుటే ఆవుల తాళ్లు విప్పుతున్నా దొంగల చేతుల్లో ఉన్న కత్తులను చూసి ప్రాణభయంతో అక్కడ నిద్రిస్తున్న పాడి రైతు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయినట్లు తెలిసింది. ఒక్కో పాడి ఆవు తక్కువలో తక్కువ రూ. 50 వేలు విలువ చేస్తుండడంతో దొంగలు ఎత్తుకెళ్లి భాఈగా సంపాదిస్తున్నారు.
బిహార్ గ్యాంగ్‌గా అనుమానం
పాడి పశువుల చోరీలకు పాల్పడుతున్న దుండగులు బిహార్ గ్యాంగ్‌గా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన పలువురితో సంబంధాలు కలిగి ఉన్న ఈ నేరస్తులు ఆవులను ఎత్తుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హిందూపురం, బాగేపల్లి, చిక్కబళాపురం, బెంగళూరుకు చెందిన పాత నేరస్తుల హస్తం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment