అశ్వియ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
ఆర్థిక లావాదేవీలే చిన్నారి హత్యకు కారణం
మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ వెల్లడి
పుంగనూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చిన్నారి అశ్వియ అంజుమ్(7) కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ మణికంఠ చందవోలు చెప్పారు. ఆయన ఆదివారం జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ఉబేదుల్లా కాంపౌండులో ఉన్న అజు్మతుల్ల కుమారై అశ్వియఅంజుమ్ గత నెల 29న రాత్రి 7 గంటల సమయంలో ఆడుకుంటూ అదృశ్యమైందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి.. 12 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
కాగా, ఈ నెల 2న బాలిక పట్టణ సమీపంలోని ఎన్‌ఎస్‌పేట సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులో శవమై దొరికిందని తెలిపారు. అదే రోజు పోస్టుమార్టం నిర్వహించగా.. బాలిక ఊపిరితిత్తుల్లో నీరు, ఆహారం ఉండటాన్ని గమనించి ఆ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. బాలిక తండ్రి అజు్మతుల్ల ఒక మహిళకు రూ.3.5 లక్షలు అప్పు ఇచ్చినట్లు, ఆ అప్పు కోసం ఆ మహిళను వేధించడం, కోర్టుకీడుస్తానంటూ బెదిరించడంతో ఆ మహిళ విసుగు చెంది ఈ ఘాతుకానికి పాల్పడిందన్నారు.
ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బురఖా వేసుకుని ఆ మహిళ వచ్చి.. చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిందని ఎస్పీ తెలిపారు. తన కుమారైతో కలిసి చిన్నారికి ఇంట్లో అన్నం పెట్టిందని, అనంతరం ఆ చిన్నారిని నోరు, ముక్కు మూసిపెట్టి హత్య చేసినట్టు ఎస్పీ చెప్పారు. అదే సమయంలో తమకు సమీప బంధువైన ఓ బాలుడిని ఇంటి ముందు కాపాలాగా పెట్టినట్టు తెలిపారు.
బాలుడి సూచన మేరకు..
తర్వాత బాలుడి సూచన మేరకు చిన్నారి శవాన్ని బైక్‌పై సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు వద్దకు తీసుకెళ్లి నీటిలో పడేసినట్టు ఎస్పీ తెలిపారు. ఈ విషయాన్ని బాలుడు స్వయంగా అంగీకరించగా.. ముగ్గురినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపిస్తున్నట్టు వెల్లడించారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. సమావేశంలో పలమనేరు డీఎస్పీ ప్రభాకర్, ఎస్‌బీ సీఐ భాస్కర్, డాక్టర్ మధుసూదనచారి పాల్గొన్నారు.
మీడియాపై కలెక్టర్ మండిపాటు
జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ మీడియా తమ ఇష్టానుసారం వార్తలు రాస్తోందని, సోషల్ మీడియాలోనూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మైనర్ బాలిక పేర్లను, వారి వివరాలను ఎలా మీడియాలో వేస్తారని విలేకరులను ప్రశి్నంచారు.
Comments
Please login to add a commentAdd a comment