సాక్షి, చెన్నై : ఓ ప్రమాదం కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రమాదంలో మరణించాడని భార్య ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, తానూ బలన్మరణానికి పాల్పడింది. పిల్లలు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. తాంబరం సమీపంలోని సేలయూరుకు చెందిన మనోజ్‌కుమార్(38), నిద(34) పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు యోగేష్(9), కుమార్తె కనిష్క(6) ఉన్నారు. మనోజ్ అంబత్తూరు పారిశ్రామికవాడలోని ఓ సంస్థలో పనిచేసేవాడు. గత నెలలో విధులకు వెళ్లి మోటారు సైకిల్ మీద వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో మనోజ్ కుమార్ మరణించాడు. మనోజ్ ఇక లేడన్న విషయాన్ని నిద జీర్ణించుకోలేకుండా పోయింది.
ఆదివారం రాత్రి విషం కలిపిన ఆహారాన్ని ఇద్దరు పిల్లలకు ఇచ్చింది. తాను స్వీకరించింది. కాసేపటికి కడుపులో మంటగా ఉందని యోగేష్ ఆందోళనతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు. కింద ఇంట్లో ఉన్న తాతయ్యకు విషయం చెప్పాడు. ఆయన ఇంటి పైకి వచ్చి చూడగా నిద, కనిష్క అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని క్రోం పేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిద చికిత్సపొందుతూ మరణించింది. పిల్లలు ఇద్దరు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం ఎగ్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి, తల్లి మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. తాతయ్య ఉన్నా, వయస్సు మీద పడటంతో బంధువులు ఆస్పత్రికి వెళ్లి సహకారం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment