ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
తోటచర్ల(పెనుగంచిప్రోలు): ముందు వెళ్తున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ దుర్మరణం చెందగా.. మరో 12 మంది గాయాలపాలయిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు బయలుదేరింది. బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల వద్దకు రాగానే జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తున్న లారీకి సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఆ వెనుకే వేగంగా వస్తున్న బస్సు ఆ లారీని బలంగా ఢీకొంది. ప్రమాదంలో గన్నవరానికి చెందిన బస్ డ్రైవర్ షేక్ శివబాబు (37) క్యాబిన్‌లోనే ఇరుక్కుని మృతి చెందాడు.
గంపలగూడెం మండలం ఊటుకూరుకు చెందిన బస్ క్లీనర్ సంగీతం రాఘవయ్య, ప్రయాణికులు కడపకు చెందిన బోయల శంకరరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన జలగం నరసింహారావు, బండారుపల్లి ఆదినారాయణ, నేరళ్ల నాగేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బి.నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వరగు ప్రసన్న, బెంగళూరుకు చెందిన చెంబి ప్రశాంత్, విజయవాడకు చెందిన కోగంటి ముద్దుకుమార్, గన్నవరానికి చెందిన మేదరమెల్లి చెంచుకృష్ణ, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన డి.మల్లేశ్వరి, రామకృష్ణారావు గాయపడ్డారు. వీరందరిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.కాగా, బస్సు ముందుభాగం ధ్వంసం కావడంతో అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులను కిందకు దించారు. ఎస్‌ఐ ఎస్.హరిప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment