గొలగమూడి గురుకుల పాఠశాల ఖాళీ స్థలాన్ని ఆక్రమించిన టీడీపీ నేతలు
అడ్డుకోబోయిన మహిళా టీచర్లకు బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారం చేపట్టిన గంటల వ్యవధిలోనే టీడీపీ నేతలు బరి తెగించారు. ప్రభుత్వ స్థలాల కబ్జాకు తెర తీశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి అండతో స్థానిక నేతలు చెలరేగిపోతున్నారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో టీడీపీ నాయకులకు ప్రభుత్వ భూమిపై కన్ను పడింది. అనుకున్నదే తడవుగా పట్ట పగలే జేసీబీ యంత్రంతో ఆ భూమిని చదును చేశారు. వెంకటాచలం మండలం గొలగమూడిలో ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలకు ఆనుకుని సీజేఎఫ్‌ఎస్ భూములున్నాయి.
ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల కోసం మరింత స్థలం కేటాయించాలని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది కోరడంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి చెందిన వ్యక్తికి గతంలో సీజేఎఫ్‌ఎస్ పథకం కింద కేటాయించిన 1.25 ఎకరాల భూమిని పాఠశాల కోసం అప్పగించింది. వాస్తవానికి సీజేఎఫ్‌ఎస్ పథకం కింద కేటాయించిన భూమిపై ఏ వ్యక్తికీ అధికారం లేదు. ఈ భూమికి ఆర్డీవో హక్కుదారుగా ఉంటారు. సదరు వ్యక్తికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమిని కేటాయిస్తామని రెవెన్యూ అధికారులు చెప్పారు.
అయితే ఇంతలోనే సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ ఎన్నికల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గెలవడం, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ టీడీపీ నేత అది తన భూమేనంటూ దౌర్జన్యపూరితంగా ఆక్రమించేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఒక గిరిజన పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని ఆక్రమించే సాహసం చేయడం చూస్తే టీడీపీ నేతలు ఏ విధంగా బరి తెగించారో అర్థమవుతోంది.
ఈ భూఆక్రమణను ఆశ్రమ గిరిజన పాఠశాల ఉపాధ్యాయినులు అడ్డుకోబోతే వారిని సైతం బెదిరించారు. ఈ భూమి పాఠశాలకు కేటాయించారని చెప్పినా వినకుండా చదును చేశారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు సాక్షి ప్రయతి్నంచగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment