జగిత్యాల క్రైం: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో ఏ–2గా ఉన్న రాజశేఖర్ ఆర్థిక మూలాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. వాస్తవానికి ఈ కుటుంబం గతంలో ఆర్థికంగా అంత ఉన్నదేమీకాదు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ తండ్రి ఉపాధి కోసం దుబాయ్, సౌదీ, మస్కట్, లిబియా లాంటి దేశాలకు వలస వెళ్లారు. అంతోఇంతో సంపాదించి ఆ సొమ్ముతో తన కుమారుడు, కుమార్తెను చదివించారు.
తల్లి అంగన్‌వాడీ టీచర్ ఉద్యోగం చేస్తూ పిల్లల ఆలనాపాలనా చూసుకుంది. చదువు పూర్తయ్యాక రాజశేఖర్ టీఎస్‌పీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేరాడు. అయితే ‘ఉద్యోగంలో చేరిన కొద్దికాలంలోనే తాటిపల్లిలో ఆధునిక హంగులతో రూ.25 లక్షలు – రూ.30 లక్షల విలువైన భవనం నిర్మించాడు. తన ఇద్దరు స్నేహితులకు ఉద్యోగాలు ఇప్పించాడు.
సోదరికి కరీంనగర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారు న్యూజిలాండ్‌లో స్థిరపడగా..తల్లిదండ్రులు స్వగ్రామంలోనే ఉంటున్నారు. వారికి గ్రామ శివారులో సుమారు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది..’అని గ్రామస్తులు చెబుతున్నారు. వీటన్నిటిపైనా సిట్ దృష్టి సారించినట్లు తెలిసింది.
బంధువుల సాయంతో కాంట్రాక్టు ఉద్యోగం..
కరీంనగర్‌లో డిగ్రీ పూర్తిచేసిన రాజశేఖర్ కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉండి కంప్యూటర్ హార్డ్‌వేర్ కోర్సులో శిక్షణ పొందాడు. తర్వాత అఫ్గానిస్తాన్ వెళ్లి అక్కడ మూడేళ్ల పాటు కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశాడు. తిరిగి స్వదేశానికి వచ్చి లంబాడిపల్లికి చెందిన సుచరితను వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఐదేళ్ల బాబు ఉన్నాడు.
కాగా రాజశేఖర్‌కు కరీంనగర్‌లోని అతని సమీప బంధువులు 2017లో టీఎస్‌పీఎస్సీలో కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించినట్లు తెలుస్తోంది. తమ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడని, నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం పొందుతున్నాడని తల్లిదండ్రులు గ్రామస్తులకు చెబుతూ వచ్చినట్లు సమాచారం.
సన్నిహితులు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు
రాజశేఖర్ తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు స్నేహితులకు 2018లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిసింది. ఒకరు విద్యాశాఖలో, మరొకరు వేరే శాఖలో పని చేస్తున్నట్లు సమాచారం. కాగా రాజశేఖర్ మరికొందరికి కూడా ఈ విధంగా ఉద్యోగాలు ఇప్పించాడని తెలుస్తోంది.
TSPSC Paper Leak: రాజశేఖర్ ఆర్థిక పరిస్థితిపై సిట్ ఆరా
Published Fri, Mar 17 2023 3:15 AM | Last Updated on Fri, Mar 17 2023 10:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment