సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో (టీఎస్‌పీఎస్సీ) చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టులు మొదలై 90 రోజులు కావస్తుండటంతో నాంపల్లి న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ వేశారు. ఇందులో 37 మందిపై అభియోగాలు మోపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మిగిలిన వారిపై అదనపు చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు.
యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ చేతికి చిక్కిందెలా?
కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లో ఉన్న కంప్యూటర్ నుంచి మాస్టర్ ప్రశ్నపత్రాలను కమిషన్ మాజీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అట్ల రాజశేఖర్ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకోవడం ద్వారా చేజిక్కించుకున్నట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఆ కంప్యూటర్‌లోకి చొరబడటానికి వాడిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వారి చేతికి ఎలా చిక్కిందనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు.
నిందితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్‌చార్జ్‌గా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను తన పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. వాటిని ప్రవీణ్ నోట్ చేసుకొని రాజశేఖర్‌కు తెలిపాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఆపై కంప్యూటర్‌ను నిందితులు హ్యాక్ చేశారనే ఆరోపణలు వచ్చినా దానికీ ఆధారాలు లభించలేదు.
50 మంది నిందితుల్లో చిక్కిన 49 మంది...
బేగంబజార్ పోలీసుస్టేషన్‌లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ అయింది. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏసీపీ పి.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో ఇప్పటివరకు 50 మందిని నిందితులుగా తేల్చి 49 మందిని అరెస్టు చేశామని సిట్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. న్యూజిల్యాండ్‌లో ఉన్న నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. 50 మందిలో 16 మంది పేపర్ల విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్లే. అక్రమంగా ఏఈఈ ప్రశ్నపత్రం పొంది పరీక్ష రాసిన వాళ్లు ఏడుగురు, ఏఈ ప్రశ్నపత్రం పొంది రాసిన వాళ్లు 13 మంది, డీఏఓ పేపర్ పొంది పరీక్ష రాసిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు.
అరెస్టు అయిన నిందితుల్లో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌లతోపాటు షమీమ్, రమేష్ కుమార్‌లు కమిషన్ ఉద్యోగులు. వారిలో రాజశేఖర్ మినహా మిగిలిన ముగ్గురూ గ్రూప్–1 పరీక్ష రాశారు. టీఎస్‌పీఎస్సీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి మానేసిన సురేష్ సైతం గ్రూప్–1 పేపర్ పొంది పరీక్ష రాశాడు. ఇరిగేషన్ శాఖ మాజీ ఏఈ పూల రమేష్ సహకారంతో ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురినీ సిట్ అరెస్టు చేసింది. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి ప్రశ్నపత్రాల క్రయవిక్రయాల్లో రూ.1.63 కోట్లు చేతులు మారినట్లు తేలింది.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్స్, ల్యాప్‌టాప్స్, హార్డ్‌డిసు్కలతోపాటు ఫోన్లను విశ్లేషణ నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాక నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు లీకేజీ కేసులో అరెస్టు అయిన మాజీ ఏఈ పూల రమేష్ ఆరు రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో ఇతడికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment