హేమంత్ సాగర్, హితేందర్ సింగ్
సాక్షి, సిటీబ్యూరో: ఆన్‌లైన్‌లో, నేరుగా మహిళలను పరిచయం చేసుకుని, వారి ఫొటోలు సంగ్రహించి వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మరోపక్క వివిధ సైబర్ నేరాల్లో మోసపోయిన ఐదుగురు బాధితులు సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించడంతో కేసులు నమోదయ్యాయి. మణికొండ ప్రాంతానికి చెందిన హితేందర్ సింగ్ స్థానికంగా ఫర్నిచర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒడిశా నుంచి వలస వచ్చి నగరంలో నివసిస్తున్న ఓ మహిళతో అతడికి ఆన్‌లైన్‌లో పరిచయమైంది. ఆమెను మాటలతో మాయ చేసిన హితేందర్ కొన్ని వ్యక్తిగత ఫొటోలు సంగ్రహించాడు. తన కోరిక తీర్చాలని లేకపోతే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులు బుధవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారాసిగూడకు చెందిన హేమంత్ సాగర్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఇతడి ఇంటి సమీపంలో ఉండే మహిళ కుటుంబంతో పరిచయం ఉండటంతో తరచు ఆమె ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ నేపథ్యంలో అదును చూసుకుని ఆమె ఫొటోలు సంగ్రహించాడు. ఆమెతో చాటింగ్ చేసిన ఇతగాడు ఆపై బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు సోషల్ మీడియాలో అతడిని బ్లాక్ చేసింది. దీంతో హేమంత్ ఆన్‌లైన్‌లో ఆమె భర్తను బెదిరించడం మొదలు పెట్టాడు. వివాహిత ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ వేధిస్తుండటంతో బాధితులు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు హేమంత్ నిందితుడిగా గుర్తించారు. అయితే ఆ సమయంలో అతను ఆస్ట్రేలియాలో ఉండటంతో వేచి చూశారు. ఇటీవల ఇండియాకు వచ్చిన ఇతగాడు బెంగళూరులో క్వారంటైన్ పూర్తి చేసుకుని నగరానికి చేరుకున్నట్లు సమాచారం అందడంతో సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేశారు.
సైబర్ నేరాలివీ..
♦ నగరంలోని బేగంపేట, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు చెందిన ఇద్దరి క్రెడిట్ కార్డులు దుర్వినియోగం అయ్యాయి. వీటిని వినియోగించిన సైబర్ నేరగాళ్లు విదేశాల్లో రూ.1.33 లక్షలు, రూ.1.37 లక్షలు లావాదేవీలు చేశారు.
♦ క్రెడిట్‌కార్డు రీడిమ్ పాయింట్లు ఖాతాలో జమ చేస్తామంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి కార్డు వివరాలు, ఓటీపీ సంగ్రహించారు. వీటి ఆధారంగా రూ.47 వేలు కాజేశారు.
♦ సిటీకి చెందిన మరో యువకుడికి ఎస్కార్ట్ సర్వీసెస్ పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. వారి మాటల వల్లో పడిన ఇతగాడు తన క్రెడిట్‌కార్డుకు సంబంధించిన వివరాలు చెప్పడంతో సైబర్ నేరగాళ్లు రూ.70 వేలు కాజేశారు.
♦ రసూల్‌పుర ప్రాంతానికి చెందిన బాలరాజ్ అనే యువకుడు సెకండ్‌హ్యాండ్ కారు ఖరీదు చేయాలని భావించాడు. దీనికోసం ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్ చేసిన అతడు మాచర్ల నవీన్ కుమార్ పేరుతో ఉన్న సెకండ్ హ్యాండ్ ఇన్నోవా అమ్మకం యాడ్‌ను చూసి స్పందించాడు. అతడిని సంప్రదించగా బేరసారాల తర్వాత అడ్వాన్సు, రవాణా చార్జీల పేరుతో రూ.1.4 లక్షలు కాజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment