విజయనగరం క్రైమ్: ఆటోలో ప్రయాణిస్తూ పక్కనే ఉన్న మహిళల బ్యాగ్‌ల నుంచి దొంగతనాలు చేసే మహిళలు.. ఇటీవలి కాలంలో తమ పంథా మార్చుకున్నారు. కత్తితో బెదిరించి ఆభరణాలు దొంగలించడం ప్రారంభించారు. అలాంటి ఇద్దరు పాత మహిళా నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ అనిల్ పులిపాటి నేరస్తుల వివరాలను మంగళవారం వెల్లడించారు.
గంట్యాడ మండలానికి చెందిన కమ్మెల్ల రామలక్ష్మి ఈ నెల 2వ తేదీన విజయనగరం పట్టణంలోని బంగారుషాపులో 11.5 తులాల బరువున్న రెండు మొలగొలుసులను కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో గంట్యాడకు ఆటోలో వెళ్తుండగా అదే ఆటోను అయ్యన్నపేట దాటిన తర్వాత ఇద్దరు పాత మహిళా నేరస్తులైన కొత్తవలస 202 కాలనీకి చెందిన గంటా కాళేశ్వరి, విశాఖ జిల్లా కె.కోటపాడు గ్రామానికి చెందిన రావుల ఎల్లారమ్మలు ఎక్కారు.
రామలక్ష్మి ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చి ఒక మహిళా నేరస్తురాలు కత్తిచూపించి బెదిరించిగా, మరో నేరస్తురాలు బ్యాగ్‌లో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై గంట్యాడ పోలీసు స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదుచేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంగళవారం గంట్యాడ మండలం తామరపల్లి కూడలి వద్ద ఆకస్మిక వాహన తనిఖీలు చేస్తుండగా ఎస్.కోట నుంచి గంట్యాడ వైపు వస్తున్న ఆటో తామరాపల్లి జంక్షన్ వద్దకు చేరుకునే సమయంలో ఆటో దిగి గాబరాగా వెళ్లిపోతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించారు. దీంతో వారు పాతనేరస్తులమని, బంగారు ఆభరణాలను తస్కరించింది తామేనని అంగీకరించారు. ఆభరణాలను పోలీసులకు అప్పగించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. వారిలో కాళేశ్వరిపైన 22 కేసులు, ఎల్లారమ్మపై 18 కేసులు గతంలో ఉన్నట్లు గుర్తించారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ కాంతారావు, టి.సత్యమంగవేణి, ఎస్‌ఐ కిరణ్‌కుమార్ నాయుడు, ఏఎస్‌ఐలు గౌరీశంకర్, లక్ష్మి, కానిస్టేబుల్స్ శ్రీనివాసరావు, రామకృష్ణరావు, ప్రతాప్, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment