రాజానగరం: తీవ్ర పని ఒత్తిడి, జీతాలందక ఆర్థిక ఇబ్బందులు ఒక వీఆర్వో ప్రాణాలు తీసుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), వీఆర్వోల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి పెనుమాక గనిరాజు (47) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. విధి నిర్వహణలో భాగంగా మంగళవారం అర్ధరాత్రి వరకు పనిచేసిన ఆయనకు గుండెనొప్పి రావడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. కడియం మండలం జేగురుపాడుకు చెందిన గనిరాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పని ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరిబిక్కిరి చేయడంతో గనిరాజు గుండెపోటుకు గురై మృతిచెందారని మండల వీఆర్వోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జాన్, ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ మంత్రికి లేఖ రాశారు. అధికారులు అనేక పనులు పురమాయిస్తున్నారని తెలిపారు.
దీనికితోడు టార్గెట్లు పూర్తిచేసే వరకు జీతాలు కూడా నిలిపేయడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని పేర్కొన్నారు. ఇంతవరకు అక్టోబర్ నెల జీతాలు రాలేదని తెలిపారు. దీంతో కుమార్తెల ఫీజు, ఇంటి అద్దె సకాలంలో చెల్లించలేక ఆవేదనతో ఉన్న గనిరాజు.. నీటిపన్నుల కలెక్షన్ డేటాను త్వరగా ఎంట్రీ చేయాలని అధికారులు ఫోన్‌లో ఆదేశించడంతో మంగళవారం అర్ధరాత్రి వరకు అదేపనిలో నిమగ్నమై గుండెపోటుకు గురయ్యారని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment