హవాలా డబ్బు వివరాలను వెల్లడిస్తున్న హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా రూ.3,75,30,000 డబ్బును తరలిస్తున్న ఓ ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హవాలా రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(ఓఎస్‌డీ) పి.రాధాకిషన్‌రావు తన టీంతో రెండు గంటల్లోనే హైదరాబాద్ దాటకుండా వారిని పట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో నలుగురు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు.
ఓఎస్‌డీ పి.రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లుతో కలసి అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. గుజరాత్‌లోని కంబోయి గ్రామానికి చెందిన సోలంకి ఈశ్వర్ దిలీప్‌జీ, ధర్మోడా గ్రామానికి చెందిన హరీష్‌రామ్‌భాయ్ పటేల్, పలియాడ్ గ్రామానికి చెందిన అజిత్ సింగ్ ఆర్.దోడియా, సిమార్ గ్రామానికి చెందిన రాథోడ్ కనక్‌సింగ్ నతుబాలు.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12లోని ఆనంద్ బం జారాకాలనీలో ‘పి.విజయ్ అండ్ కంపెనీ’లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈశ్వర్, హరీష్‌రామ్‌లు కారు డ్రైవర్‌లుగా పనిచేస్తుండగా.. అజిత్‌సింగ్, రాథోడ్ కనక్ సింగ్‌లు ఆఫీస్ బాయ్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పెద్ద పని నిమిత్తం రూ.3,75,30,000 నగదు తరలించేందుకు సిద్ధమయ్యారు.
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్
ఆనంద్‌బంజారా కాలనీ నుంచి ముంబైకి పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నారంటూ టాస్క్‌ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ పి.రాధాకిషన్‌రావుకు మంగళవారం ఉదయం ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో ఆయన తన సిబ్బం దిని అలర్ట్ చేశారు. ఆనంద్‌బంజారా కాలనీ నుంచి నలుగురు నిందితులు ప్రయాణిస్తున్న స్కార్పియో, హ్యుందాయ్ అసెంట్ కార్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుసరించారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 లోని స్కోడా కారు షోరూం వద్ద ఆ రెండు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాటిలో రూ.3,75,30,000 నగదు దొరికింది. నిందితులను అదుపులోకి తీసు కుని ఆ డబ్బును, కార్లను స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపారు. నిందితులను, నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పజెప్పినట్లు సీపీ అంజనీకుమార్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment