జోగిపేట (అందోల్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి భర్తను భార్య హత్య చేయించి మృతదేహాన్ని తగలబెట్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శనివారం వెలుగుచూసింది. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్ కథనం ప్రకారం.. జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం(30)కు అందోల్ మండలం మన్ సాన్‌పల్లికి చెందిన కల్పనతో 2015లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జోగిపేట పట్టణం అందోల్‌లోని డబుల్ బెడ్‌రూం కాలనీల వద్ద వీరు నివాసం ఉంటున్నారు.
కల్పనకు మన్‌సాన్‌పల్లికి చెందిన మస్కూరి మహేశ్‌తో పెళ్లికి మందు నుంచీ సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయమై మల్లేశం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి విషయం ప్రియుడు మస్కూరి మహేశ్‌కి వివరించింది.
దీంతో మహేశ్.. రంగంపేటకు చెందిన తన మేనబావ ఉసికే అంబాజీకి చెప్పగా, అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తలారి మహేశ్‌తో పరిచయం చేయించి, రూ.50 వేలకు హత్య చేసేలా సుపారీ మాట్లాడుకున్నారు. అడ్వాన్సుగా రూ.5 వేలు ఇవ్వగా, పలుమార్లు మరో రూ.30 వేలను అందజేశారు. ఈ విషయంలో తన స్నేహితుడు, గంగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వజ్జరి మహేశ్ సహకారం తీసుకున్నారు.
హత్య జరిగిందిలా..
వజ్జరి మహేశ్, మస్కూరి మహేశ్, తలారి మహేశ్.. ఈ ముగ్గురూ ఓ కారు అద్దెకు తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున కల్పన ఇంటి వద్దకు వెళ్లి కాపుకాశారు. 5:30 గంటల ప్రాంతంలో మల్లేశం బయటకు రాగానే అతని తలపై బండరాయితో మస్కూరి మహేశ్ బలంగా కొట్టడంతో స్పృహకోల్పోయాడు. వెంటనే అతడిని కారులో వేసుకుని సంగుపేట వైపు వెళ్లారు. మల్లేశం చేతులను కట్టేసి, గొంతు నొక్కడంతో అతను కారులోనే మృతి చెందాడు.
శుక్రవారం సాయంత్రం కోనాపూర్ చెరువు వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మల్లేశం భార్య కల్పనను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి. నిందితులు మస్కూరి మహేశ్, కల్పన, తలారి మహేశ్, వజ్జరి మహేశ్, ఉసికే అంబాజీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా కేసును కేవలం 22గంటల వ్యవధిలో ఛేదించిన జోగిపేట పోలీసులను ఎస్పీ రూపేశ్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment