సాక్షి, టెక్కలి రూరల్: ఆ దంపతులకు ఒకరంటే మరొకరికి ప్రాణం.. క్షణం కూడా విడిచి ఉండలేరు. అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు కూడా ఇద్దరూ కలిసే ద్విచక్ర వాహనంపై వెళ్లి.. తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కంటైనర్ వారి వాహనాన్ని ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న భార్య తుళ్లిపడి దుర్మరణం పాలైంది. భర్త కళ్లెదుటే భార్య మృతి చెందిన ఈ విషాద ఘటన కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం గ్రామ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటబొమ్మాళి మండలం కన్నేవలస గ్రామానికి చెందిన ఈదు ప్రసాదరావు, అతని భార్య మౌనిక (25)లు ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం రిమ్స్ అస్పత్రిలో చికిత్సపొందుతున్న వ్యక్తిని పరామర్శించేందుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. (వైశాలి.. ఊరెళ్లమంటే చనిపోతానంటోంది..!)
హరిశ్చంద్రపురం వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో వెనుక కుర్చున్న మౌనిక కిందకు పడిపోగా.. అమె తలపై నుంచి కంటైనర్ వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అయితే ప్రమాదానికి కారణమైన కంటైనర్ అక్కడనుంచి వెళ్లిపోయింది. కళ్లెదుటే భార్య కంటైనర్ చక్రాల కింద నలిగిపోయి మృతిచెందడం చూసిన ప్రసాదరావు గుండెలవిసేలా రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై లక్ష్మణరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని కోటబొమ్మాళి సమీపంలో పట్టుకున్నారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త వజ్రపుకొత్తూరు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. (జగిత్యాల జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం)
Comments
Please login to add a commentAdd a comment