నిడమనూరు : పాత కక్షల నేపథ్యంలో మచ్చ శ్రీకాంత్(22) అనే యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని నారమ్మగూడెం సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. నిడమనూరు ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం .. మిర్యాలగూడ రూరల్ మండలం తుంగపాడ్ గ్రామానికి చెందిన మచ్చ అంజయ్య కుమారుడు మచ్చ శ్రీకాంత్ తన అమ్మమ్మ బొల్లేపల్లి నర్సమ్మ దశదిన కార్యానికి నిడమనూరు మండలం రేగులగడ్డకు గురువారం వచ్చాడు.
సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తన బైక్‌పై మేనత్త ఎడ్ల ఈరమ్మ, ఆమె భర్త వెంకటయ్యను త్రిపురారంలో దించడానికి తీసుకెళ్తుండగా..పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన సమీప బంధువు వంగూరి మహేందర్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు సుమోలో వెంబడిస్తూ నారమ్మగూడెం సమీపంలోకి రాగానే బైక్‌ను ఢీ కొట్టారు. దీంతో శ్రీకాంత్, అతడి మేనత్త, మామ కింద పడిపోయారు. శ్రీకాంత్ మేనత్త, మామను వదిలేసిన దుండగులు శ్రీకాంత్ కంట్లో కారం చల్లి, కత్తులు, గొడ్డలితో దాడి చేశారు.
వరి పంట కోసిన మడిలో నీరు ఉండడంతో అందులో పడేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని ఎస్‌ఐ తెలిపారు. తుంగతుర్తిలో ఉన్న భూమిలో అధిక భాగం మచ్చ శ్రీకాంత్‌కు పట్టా చేస్తానని అమ్మమ్మ బొల్లేపల్లి నర్సమ్మ గతంలో చెప్పిందని.. దానిని మనసులో ఉంచుకుని సమీప బంధవులే దారుణానికి పాల్ప డినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాంత్ మృతదేహాన్ని మిర్యాలగూడ ఆస్పత్రికి పంపామని, శ్రీకాంత్ అక్క పోలెపల్లి వెంకటరమణ ఫిర్యాదు మేరకు సీఐ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొండల్‌రెడ్డి తెలిపారు.
ఏరియా మీదంటే.. మీది
హత్యా జరిగిన స్థలం నిడమనూరు, త్రిపురారం మండలాల శివారులో ఉంది. ఈక్రమంలో హత్యా ప్రదేశానికి చేరుకున్న ఇరు మండలాల పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతం మీదంటే మీదే అంటూ వాదించుకున్నారు. అన్నారావు క్యాంపు త్రిపురారం మండల పరిధిలో ఉండడంతో పక్కనే పొలాల్లో హత్య జరిగింది కాబట్టి కేసు అదే మండలం పరిధిలోకి వస్తుందని నిడమనూరు పోలీసులు వాదించారు. హత్య జరిగిన శివారు తమ పరిధిలోనిది కాదంటూ త్రిపురారం ఎస్‌ఐ అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment