మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు వెంటాడుతోంది. 15ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కుటుంబంలో ఆరుగురిని బలి తీసుకుంది. తల్లీకొడుకు మాత్రమే ప్రాణాలతో అప్పుడు బయట పడగా.. తాజాగా జరిగిన ప్రమాదంలో కొడుకునూ మృత్యువు కబళించింది. పుట్టిన రోజే మృత్యుఒడికి చేరడంతో స్థానికంగా విషాదం నెలకొంది.. వివరాలిలా ఉన్నాయి.. పదిహేను ఏళ్ల క్రితం రామకృష్ణాపూర్‌లో నివాసం ఉంటున్న బానోతు నిర్మల కుటుంబం దైవ దర్శనం కోసం తిరుపతికి వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరు జిల్లాలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో నిర్మల భర్త రతన్‌నాయక్, పెద్ద కుమారుడు, తల్లి, సోదరుడు, మరిది, బంధువు అయిన డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో నిర్మల, చిన్న కుమారుడు వంశీకృష్ణ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం షాక్ నుంచి కోలుకోవడానికి నిర్మలకు ఆరేళ్లు పట్టింది. మంచిర్యాల రాంనగర్‌లో నివాసం ఉంటోంది. ఆ చేదు జ్ఞాపకాలను మది నుంచి చెరిపేసుకుంటూ ఉన్న ఒక్కగానొక్క కుమారుడు వంశీకృష్ణ(21)ను కంటికి రెప్పలా చూసుకుంటూ పాలిటెక్నిక్ చదివించింది. ప్రస్తుతం వంశీకృష్ణ ఉన్నత చదువుల కోసం ప్రయత్నాల్లో ఉన్నాడు.
21వ పుట్టిన రోజునే.. ఇష్టమైన బైక్‌తో..
బానోతు వంశీకృష్ణ జన్మదినం సోమవారం కావడంతో అప్పటి వరకు ఇంట్లో సరదాగా ఉండి ఆలయానికి కూడా వెళ్లి వచ్చాడు. బయటకు వెళ్తున్నాని తల్లితో చెప్పి ద్విచక్ర వాహనంపై రామగుండం–పెద్దపల్లిలో తెలిసిన బంధువులు, స్నేహితులను కలిసేందుకు వెళ్లాడు. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ బ్రిడ్జి వద్ద ఊహించని రీతిలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పుట్టిన రోజునే చనిపోవడంతో తల్లి నిర్మల గుండెలవిసేల రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. ఆసరాగా ఉన్న ఒక్క కొడుకూ చనిపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారింది. కాగా నెల రోజుల క్రితమే వంశీకృష్ణ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. అదే బండిపై వెళ్తూ అదుపుతప్పి ప్రాణాలు కోల్పోయాడు. అందరినీ కోల్పోయి కొడుకుతో ఉంటున్న తల్లి నిర్మల ఇప్పుడు కొడుకునూ కూడా పోగొట్టుకుని అనాథగా మిగిలిపోయింది.
బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం
రామగుండం: బైక్ అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. అంతర్గాం ఎస్సై నూతి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన బానోతు వంశీకృష్ణ(21) సోమవారం బైక్‌పై కరీంనగర్ వెళ్తున్నాడు. బసంత్‌నగర్ రైల్వే ఫ్‌లైఓవర్ వంతెన సమీపంలో వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. నూతనంగా కొనుగోలు చేసిన పల్సర్ బైక్‌పై అతివేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని, వంశీకృష్ణ హెల్మెట్ కూడా పెట్టుకోలేదని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment