
సాక్షి నాంపల్లి: ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేసిన ఓ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ యువతి గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా, రామోజీపేట గ్రామానికి చెందిన మంజుల ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసింది. 2016లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రిపరేషన్ కోసం హైదరాబాద్‌లోని ఓయూకు వచ్చింది. టెట్‌కు సిద్ధమవుతున్న ఆదిలాబాద్ జిల్లా వాగాపూర్ గ్రామానికి చెందిన తిప్పిరెడ్డి రాజుతో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజుల తర్వాత రాజుకు ఉద్యోగం రావడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. అప్పటి నుంచి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా అతడి దగ్గరకు వెళ్లి నిలదీసింది. అతను పట్టించుకోకపోవడంతో ఓయూ, ఇచ్చోడ, వాగాపూర్ ఠాణాల్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడమే కాకుండా తనను అసభ్య పదజాలంతో దూషించారని బాధితురాలు ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన తిప్పారెడ్డి రాజుపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితురాలు తన ఫిర్యాదులో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment