తండ్రి క‌ళ్ల ముందే..ప్రాణాలు విడిచిన కుమార్తె | - | Sakshi
Sakshi News home page

తండ్రి క‌ళ్ల ముందే..ప్రాణాలు విడిచిన కుమార్తె

Published Mon, Apr 17 2023 1:58 AM | Last Updated on Mon, Apr 17 2023 1:07 PM

- - Sakshi

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ: అనుకోని ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది.. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న కుమార్తెను అనంత లోకాలకు తీసుకుపోయింది.. తండ్రి కళ్ల ముందే కుమార్తె మృత్యువాత పడిన సంఘటన తొండంగి మండలం బెండపూడి పంచాయతీ తమ్మయ్యపేట గ్రామ శివారు జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొనడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. తొండంగి ఎస్సై ఎస్‌.రవికుమార్‌ కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కరప మండలం గొడ్డటిపాలెం గ్రామానికి చెందిన వీరంరెడ్డి ముత్యాలరావు తన కుమార్తె చంద్రకళ (16), తన మరదలి కుమార్తె శిరీషలతో కలసి రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెంలో బంధువుల ఇంట శుభకార్యానికి బైక్‌పై బయలు దేరారు.

మిగతా బంధువులైన మహిళలు ఆటోలో వెనుక వస్తున్నారు. కత్తిపూడి దాటిన తర్వాత బెండపూడి గ్రామ పంచాయతీ తమ్మయ్యపేట శివారు రావికంపాడు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ వేగంగా వెళ్తూ వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌ అదుపు తప్పడంతో ముగ్గురూ కింద పడిపోయా రు. చంద్రకళ రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.

ముత్యాలరావుకు స్వల్ప గాయాలు కాగా శిరీష ప్రాణాపాయం నుంచి బయటపడింది. కళ్లెదుటే కుమార్తె మృత్యువాత పడటంతో తండ్రి ముత్యాలరావు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వెనుకే ఆటోలో వస్తున్న తల్లి, బంధువులు ప్రమాద స్థలంలో విగతజీవిగా పడి ఉన్న చంద్రకళ మృతిదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్సై రవికుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై వివరించారు.

గొడ్డటిపాలెంలో విషాదం
గొడ్డటిపాలెంకు చెందిన చంద్రకళ ప్రమాదంలో మరణించడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ముత్యాలరావుకు భార్యతో పాటు కుమార్తె చంద్రకళ, ఒక కుమారుడు ఉన్నారు. చంద్రకళ కాకినాడలోని ఉమెన్స్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ చదువుతోంది. కుమారుడు తాపీపని చేస్తున్నాడు. కొడుకు చదువుకోకపోయినా, కూతురినైనా చదివించుకుందామనుకుంటే తీరని అన్యాయం జరిగిందని తల్లి రోదించడం చూసి అందరి కళ్లూ చెమర్చాయి. తమతో కలసి చదువుతున్న స్నేహితురాలు మృతి చెందడంతో సహచరులు తల్లడిల్లిపోయారు. మోటార్‌ సైకిల్‌పై ఎక్కించుకోకుండా ఉంటే ఇలా జరిగేది కాదని తండ్రి ముత్యాలరావు ఆవేదన వ్యక్తం చేశాడు.

తండ్రి కళ్ల ముందే కుమార్తె మృతి

తమ్మయ్యపేటలో దుర్ఘటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement