బాలిక బంధువులతో మాట్లాడుతున్న అధికారులు
నల్లజర్ల: బాల్యవివాహాలను అరికట్టడంలో దిశ యాప్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు 40కిపైగా బాల్య వివాహాలను జరగకుండా నిలుపుదల చేశారు. తాజా గా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లలపాడు గ్రామంలో బాలిక వివాహం జరగకుండా దిశ పోలీసులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినికి ఈ నెల 6న వివాహం చేస్తున్నట్టు గ్రామ మహిళా సంరక్షణాధికారి ఇందిరా ప్రియదర్శినికి సమాచారం అందింది. ఈ విషయం రాజమహేంద్రవరంలోని దిశ పోలీసులకు ఆమె సమాచారం అందించారు.
దిశ పోలీసులు తమతో పాటు ఐసీడీఎస్ అధికారులను తమ వెంట తీసుకొని ఆ బాలిక ఇంటికి వెళ్లారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను ఆ బాలిక తల్లిదండ్రులకు, పెద్దలకు వివరించారు. బాలిక వివాహాన్ని నిలుపుదల చేయాలని సూచించారు. అందుకు వారు సమ్మతించారు. ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా దిశ, ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు. ఆ బాలిక చదువు కొనసాగించాలని అధికారులు సూచించారు.
తమకు సమాచారం అందించిన మహిళా సంరక్షణ అధికారి ఇందిర ప్రియదర్శినిని అధికారులు అభినందించారు. ఎక్కడ బాల్యవివాహాలు జరిగినా దిశ యాప్‌కు సమాచారం అందించాలని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment