సాత్విక్ తల్లిదండ్రులు విశ్వనాథ్, రంగమణిలను అభినందిస్తున్న మంగుళూరు క్రీడాభిమానులు - Sakshi
సాక్షి, అమలాపురం: పన్నెండేళ్ల ప్రాయం అంటే అమ్మానాన్న చేతులు పట్టుకుని నడిచి వెళ్లే వయస్సు. కానీ ఆ వయస్సులోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకుని.. దాని కోసం తల్లిదండ్రులను వదిలి.. బంధాలకు.. అనుబంధాలకు దూరంగా ఉంటూ.. ఇష్టాలను కాదనుకుని.. లక్ష్య సాధనకు ఉపక్రమించాడు అమలాపురానికి చెందిన అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్. అప్పటి వరకూ ఆట విడుపుగా ఆడుతున్న షటిల్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే లక్ష్యానికి అనుగుణంగా నిరంతర సాధన చేస్తున్నాడు.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు. రెండేళ్ల క్రితం మొదలైన సాత్విక్, అతడి సహచరుడు చిరాగ్ శెట్టిల విజయయాత్ర అప్రతిహతంగా సాగుతోంది.
తాజాగా చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో మన దేశానికి శనివారం బంగారు పతకం అందించారు. తద్వారా అంతర్జాతీయ వేదికపై సాత్విక్ మరోసారి సత్తా చాటాడు. గతంలో జరిగిన ఆసియా కప్‌లో భారత జట్టు తరఫున రజత పతకానికి మాత్రమే పరిమితమైన సాత్విక్.. ఈసారి డబుల్స్‌లో బంగారు పతకం సాధించడం.. ఆయన సొంత ప్రాంతమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాసుల్లో సంతోషాన్ని నింపింది. సాత్విక్ తన పన్నెండో ఏట నుంచే గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. 15వ ఏట తొలి అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్నాడు. నాటి నుంచి నేటి వరకూ ఎన్నో అంతర్జాతీయ టోర్నీ ల్లో విజేతగా నిలిచాడు. వీటిలో రెండుసార్లు కామన్‌వెల్త్, ఒకసారి థామస్ కప్, తాజాగా ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించడం సాత్విక్ క్రీడా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయాలు.
ఊరిస్తున్నది ఒలింపిక్స్ పతకమే..
గత ఒలింపిక్స్ క్రీడల్లో చేతి వరకూ వచ్చిన పతకం సాత్విక్ జోడీకి దూరమైంది. డబుల్స్ విభాగంలో సహచరుడు చిరాగ్ శెట్టితో కలిసి మూడు మ్యాచ్‌లకు గాను, రెండు మ్యాచ్‌లు గెలిచినా పాయింట్లు తక్కువ కావడంతో క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోయారు. లేకుంటే ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో సాయిరాజ్ సాత్విక్ జంట ఏదో ఒక పతకాన్ని సాధించేది. జీవితాశయమైన ఒలింపిక్ పతకం త్రుటిలో చేజారినా సాత్విక్ కుంగిపోలేదు. ఆ ఓటమి నుంచి వెంటనే కోలుకుని.. తరువాత కామన్‌వెల్త్, థామస్ కప్, తాజాగా ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించాడు. సాత్విక్ 2021లో అర్జున్ అవార్డు అందుకున్నాడు.
పలువురి అభినందనలు
ఆసియా క్రీడల్లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ బంగారు పతకం సాధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వారిని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. సాత్విక్ తల్లిదండ్రులు రంకిరెడ్డి కాశీ విశ్వనాథ్, రంగమణి దంపతులు ప్రస్తుతం కర్ణాటకలోని మంగుళూరులో ఉన్నారు. అక్కడ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, స్థానికులు వారి వద్దకు వచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. స్థానికులు ఫోనులో శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రముఖులు కూడా సాత్విక్‌ను అభినందించారు.
మరపురాని విజయాలెన్నో..
బ్యాడ్మింటన్ క్రీడలో థామస్ కప్ కీలకమైంది. అటువంటి మెగా టోర్నీలో భారత జట్టు ఎప్పుడూ ఫైనల్స్‌కు వెళ్లలేదు. కానీ గత ఏడాది ఫైనల్స్‌కు చేరడమే కాదు.. ఏకంగా మన జట్టు బంగారు పతకం సాధించడంలో సాత్విక్ ద్వయం కీలకంగా నిలిచింది. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో దేశానికి బంగారు పతకం అందించిన జట్టులో సాత్విక్ సభ్యునిగా ఉన్నాడు.
2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల డబుల్స్ విభాగంలో భారత జట్టు తరఫున సాత్విక్ బంగారు పతకం, డబుల్స్ విభాగంలో రజత పతకం సాధించాడు. గత ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో డబుల్స్‌లో బంగారు పతకం సాధించాడు. ఈ క్రీడల్లో డబుల్స్ విభాగంలో కూడా భారత్ జట్టు తరఫున బంగారు పతకాలు సాధించాడు.
వేగవంతమైన బ్యాడ్మింటన్ స్మాష్ (షటిల్‌ను వేగంగా కొట్టడం)లో సాత్విక్ గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆయన స్మాష్ గంటకు 565 కిలోమీటర్లు (372.6 మైళ్లు) అని గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment